అక్షరాభ్యాసం, అన్న ప్రాశనకు టీటీడీ శ్రీకారం: తేదీ, వేదిక: కిట్ లో: గంట ముందు రిజిస్ట్రేషన్!!
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం నాడు 62,925 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 36,297 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.77 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. బాట గంగమ్మ ఆలయం వరకు క్యూలైన్ ఏర్పడింది.
లడ్డూ విక్రయాలు నాలుగు లక్షలకు పైగా విక్రయం అయ్యాయి. ఒక్కరోజులో 4.23 లడ్లను విక్రయం అయ్యాయి. 2.40 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాలను స్వీకరించారు. అలాగే.. 2,910 మంది అస్వస్థులు కాగా.. వారికి టీటీడీ సకాలంలో వైద్య సహాయాన్ని అందించగలిగింది. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు శ్రీవారి దర్శనానికి 24 నుంచి 26 గంటల సమయం పట్టింది.

ఓ వినూత్న కార్యక్రమానికి టీటీడీ త్వరలో శ్రీకారం చుట్టబోతోంది. నూతనంగా అక్షర గోవిందం కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. దీని కింద చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం, అన్నప్రాశన, అక్షరాభ్యాసం చేయిస్తుంది. శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ వకుళామాత ఆశీస్సులతో అక్షరాభ్యాసానికి చేపట్టనుంది. జూలై 3వ తేదీ మధ్యాహ్నం 12.00 నుండి 12.30 గంటల వరకు వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆశీస్సులతో, శ్రీ వకుళామాత సన్నిధిలో చిన్నారులకు సంప్రదాయబద్ధంగా అక్షరాభ్యాసం నిర్వహిస్తారు.
అనంతరం చిన్నారులకు టీటీడీ అర్చకులు వేదాశీర్వచనాన్ని అందిస్తారు. తిరుమల శ్రీవారి ప్రసాదంతో పాటు ప్రత్యేకంగా రూపొందించిన అక్షర గోవిందం కిట్ ను కానుకగా ఇస్తారు. ఈ కార్యక్రమంలో 3 నుండి 5 సంవత్సరాల వయస్సు గల చిన్నారులు పాల్గొనవచ్చు. ఈ అక్షర గోవిందం కిట్‌లో రాతపలక, బలపాలు, అక్షింతలు, పసుపు, కుంకుమ, శ్రీవారి కంకణం, పటిక బెల్లం, శ్రీ వకుళామాత, శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీ సరస్వతీదేవి చిత్రపటాలు, గోవింద నామాలు, శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం, పెద్దబాలశిక్ష తదితర పూజా, విద్యా సామగ్రిని ఉచితంగా అందజేస్తారు.
అదేవిధంగా ఆలయ అర్చకుల పర్యవేక్షణలో వేదమంత్రోచ్ఛారణల మధ్య చిన్నారులకు తొలి అన్నప్రాశనను ఆగమోక్తంగా నిర్వహిస్తుంది టీటీడీ. అనంతరం వారికి శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ వకుళామాతల ఆశీస్సులను అందజేస్తారు. జూలై 4 నుండి మంగళవారం మినహా అన్ని రోజుల్లో వకుళమాత ఆలయ అర్చకులు నిర్ణయించిన శుభ ముహూర్తంలో ఆలయంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రతిరోజూ బ్యాచ్ కు 25 మంది చిన్నారులు చొప్పున రెండు బ్యాచ్‌లలో మొత్తం 50 మందికి మాత్రమే అవకాశం కల్పిస్తారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనదలచిన వారు గంట ముందస్తుగా ఆలయ ప్రాంగణంలో నమోదు చేసుకోవాలి. చిన్నారులు తల్లిదండ్రులు లేదా సంరక్షకులతో కలిసి సంప్రదాయ వస్త్రధారణలో హాజరుకావాలని టీటీడీ సూచించింది. శ్రీ వకుళామాత, శ్రీ వేంకటేశ్వరస్వామివారి దివ్య అనుగ్రహంతో తమ పిల్లల విద్యారంభం, అన్నప్రాశనను పవిత్రంగా నిర్వహించుకునేందుకు ఈ ప్రత్యేక సేవలను భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరుతోంది.












Click it and Unblock the Notifications