కేతన్ అగర్వాల్ హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్.. మాస్టర్‌మైండ్ ఎవరో తెలుసా!
మహారాష్ట్రలోని పుణెకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి కేతన్ అగర్వాల్(26) హత్య కేసులో రోజుకో కొత్త నిజం వెలుగులోకి వస్తోంది. పోలీసుల ప్రాథమిక విచారణలో కేతన్ అగర్వాల్ కాబోయే భార్య సియా గోయల్(20) ఈ దారుణానికి పక్కా వ్యూహంతో స్కెచ్ వేసినట్లు తేలింది. పోలీసుల విచారణలో సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ.. తాము అమాయకులమని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు జరిగిన దర్యాప్తును బట్టి ఈ నేరానికి సియా గోయల్ అసలైన మాస్టర్‌మైండ్ అంటూ పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
పెళ్లి ఇష్టం లేకే హత్య.. 3 సార్లు ప్లాన్ ఫెయిల్!
ఎస్పీ వెల్లడించిన వివరాల ప్రకారం.. సియా గోయల్, చేతన్ చౌదరిలు ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు.అయితే కుటుంబ సభ్యులు కేతన్ అగర్వాల్‌తో సియా గోయల్‌కు ఎంగేజ్మెంట్ చేశారు. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదనే విషయాన్ని, తాను చేతన్ చౌదరిని ప్రేమిస్తున్నానని సియా ముందే కేతన్‌కు స్పష్టం చేసింది. అయినప్పటికీ కేతన అగర్వాల్ పెళ్లి రద్దు చేసుకోవడానికి ఒప్పుకోలేదు. తన కుటుంబం చాలా సంపన్నమైనదని, పారిపోయినా వదిలిపెట్టనని కేతన్ అగర్వాల్ బెదిరించినట్లు సియా గోయల్ పోలీసులకు తెలిపింది. దీంతో కేతన్‌ను వదలించుకోవాలని జూన్ 14న లోహాఘర్ కోట కొండపై నుంచి కిందకు తోసేయడానికి సియా గోయల్ తొలిసారి ప్రయత్నించింది. అలా ఒకటికి మూడు సార్లు ఆమె చేసిన హత్యాయత్నాలు విఫలమవ్వడంతో చివరికి ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి ఘాతుకానికి ఒడిగట్టింది.

మా కూతురిని చంపేయాలి.. తల్లిదండ్రుల ఆగ్రహం!
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇంత పెద్ద నేరం చేసినప్పటికీ సియా గోయల్ ముఖంలో ఎలాంటి పశ్చాత్తాపం గానీ, బాధ గానీ కనిపించడం లేదు. మరోవైపు ఆమె ప్రియుడు చేతన్ చౌదరి మాత్రం పోలీసుల విచారణలో పూర్తిగా లొంగిపోయి, నిజాలు ఒప్పుకుంటూ దర్యాప్తునకు సహకరిస్తున్నాడు. ఈ ఘటనపై సియా తల్లిదండ్రులు తీవ్రంగా స్పందించారు. పెళ్లి గురించి తాము పలుమార్లు అడిగినా కూతురు ఒప్పుకుందని, అంత మంచి అబ్బాయిని, కుటుంబాన్ని పొట్టనబెట్టుకున్న సియాను కూడా అదే కొండపై నుంచి కిందకు తోసేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆధారాలు మాయం చేసేందుకు పక్కా స్కెచ్
హత్యకు ముందే సియా గోయల్, చేతన్ చౌదరిలు పక్కాగా ప్లాన్ చేసినట్లు ఆధారాలు లభించాయి. జూన్ 6నే కేతన్ అగర్వాల్ పాస్‌పోర్టును సియా గోయల్ పారేసింది. అలాగే చేతన్ చౌదల్ జూన్ 18న తన మొబైల్ షాపులోనే వదిలేసి .. లొకేషన్ దొరకకుండా ఉండేందుకు తన ఉద్యోగి మొబైల్ ఫోన్ తీసుకుని లోహాఘర్ కోటకు వెళ్లాడు. అంతే కాకుండా మే 31 నుంచి జూన్ 4 మధ్య పుణెలోని ఒక కేఫ్‌లో వీరిద్దరూ పలుమార్లు కలుసుకున్నట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు. గురువారం పుణె రూరల్ పోలీసులు సియా గోయల్‌ను లోహాఘర్ కోటకు తీసుకెళ్లి క్రైమ్ సీన్ రీక్రియేషన్ చేశారు. ఫోరెన్సిక్ బృందం కూడా ఘటనా స్థలంలో కీలక ఆధారాలను సేకరించింది. కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications