మిత్రుల రాజకీయ సమ్మేళనాలు
హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రాజకీయ సమ్మేళనాలు నిర్వహించాలని తెలుగుదేశం, వామపక్షాల నాయకులు నిర్ణయించుకున్నారు. ఈ నెల 25 నుంచి వచ్చే 2వ తేదీ వరకు ఈ రాజకీయ సమ్మేళనాలు నిర్వహించనున్నట్లు తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు ప్రకటించారు. చంద్రబాబు నివాసంలో మంగళవారం ఉదయం సమావేశమైన అనంతరం వారు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తమ పార్టీల కార్యకర్తల్లో రాజకీయ స్ఫూర్తిని నింపేందుకు ఈ సమ్మేళనాలు జరుగుతాయని వారు చెప్పారు.
తాము ప్రజాసమస్యలపై ఉమ్మడి పోరాటాలు చేయాలని నిర్ణయించుకున్నట్లు చంద్రబాబు చెప్పారు. సమావేశంలో భవిష్యత్తు కార్యక్రమాలపై కూడా మాట్లాడుకున్నట్లు ఆయన తెలిపారు. బాబ్లీ ప్రాజెక్టు సహా అన్ని ప్రజాసమస్యలపై ఉమ్మడి పోరాటాలు చేయాలని నిర్ణయించుకున్నట్లు నారాయణ తెలిపారు. తాము అల్పాహారం ఓ చోట, మధ్యాహ్న భోజనం ఓ చోటా చేస్తున్నట్లు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అంటున్నారని, తాము భోజనాలు మాత్రమే చేస్తున్నామని, రాజశేఖర రెడ్డిలా భూములను మెక్కడం లేదని రాఘవులు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించేందుకు తమ పార్టీల కార్యకర్తల్లో స్ఫూర్తిని నింపేందుకు రాజకీయ సమ్మేళనాలు 23 జిల్లాల్లో జరుగుతాయని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications