షిర్డీ: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా షిర్డీలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సాయిబాబా సంస్థాన్ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. భక్తులందరికీ దర్శనం లభించాలని 31 రాత్రంతా మందిరాన్ని తెరిచే ఉంచాలని సంస్థాన్ పదాధికారులు నిర్ణయించారు. భక్తులకు బస, భోజన ఏర్పాట్లు తదితర సౌకర్యాల కల్పనపై సమావేశం నిర్వహించారు. క్రిస్మస్ సెలవులు, కొత్త సంవత్సరం హడావుడితో భక్తుల రద్దీ పెరుగుతుందన్నారు. దీంతో బుధవారం నుంచి జనవరి నాలుగో తేదీ వరకు వీఐపీ పాసులు నిలిపివేయనున్నారు. భద్రతా కారణాల వల్ల 31 రాత్రి పదిన్నర గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు మందిరంలోకి పూలహారాలు తీసుకెళ్లడాన్ని పూర్తిగా నిషేధించనున్నారు. మందిరంలో తోపులాటలు జరగకుండా, భక్తులకు సులభంగా దర్శనమయ్యేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. సాధ్యమైనంతవరకు ప్లాస్టిక్ సంచులు మందిరంలోకి తీసుకురాకూడదని భక్తులకు సూచించారు. లక్షల్లో తరలివచ్చే సాయి భక్తులకు ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేకంగా స్థలాలు కేటాయించారు. రద్దీ రోజుల్లో అదనపు బలగాలను నియమించనున్నారు.