చంద్రబాబుకు పవన్ చురకలు
హైదరాబాద్ :'రాజకీయాలు ఆయన(చంద్రబాబు)కు బాగా తెలుసు. సచివాలయం కూడా బాగా తెలుసు. అందులో ఎన్ని గదులున్నాయో తెలుసు. అన్నయ్యకు (చిరంజీవికి) సెక్రటేరియట్ కూడా తెలియదంటున్నారు. మరి సెక్రటేరియట్ బాగా తెలిసిన చంద్రబాబును ప్రజలు ఓడించారు కదా!'' అని యువరాజ్యం అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చురకలంటించారు.
చిరంజీవికి రాజకీయాలు తెలియవంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న విమర్శలను యువరాజ్యం అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పొలిటికల్ ర్యాగింగ్‌తో పోల్చారు. బీజేపీ నగర మాజీ కార్యదర్శి గోవింద్ రాఠీ శనివారం ప్రజారాజ్యం పార్టీలో చేరిన సందర్భంగా పవన్ మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో సేవ చేయడానికి చిత్తశుద్ధి ఉండాలికానీ... సచివాలయం తెలియాల్సిన అవసరం లేదన్నారు. "చంద్రబాబు పొలిటికల్ ర్యాగింగ్ చేస్తున్నారు. అది మానుకోవాలి'' అని పవన్ హితవు పలికారు.
కళాశాలల్లో విద్యార్థి సంఘాల ఎన్నికలను తొలగించడంతో నాయకత్వ లక్షణాలున్నవారు తయారుకావడం లేదని అభిప్రాయపడ్డారు. తెలంగాణ పట్ల చిరంజీవి చిత్తశుద్ధితో ఉన్నారన్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాలూ తన సొంత జిల్లాలేనని చెప్పారు.












Click it and Unblock the Notifications