హైదరాబాద్: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఏ.పాల్ కు మరో సమస్య ఎదురైంది. ఆయన ఎన్నికల సంఘం అధ్యక్ష్యుడుతో గొడవపడటంతో పోలీసులు అరెస్టు చేశారు. ఓటరు జాబితా నుంచి పాల్ పేరును ఎన్నికల అధికారులు తొలగించారు. ఈవిషయమై పాల్ ఆవేశంగా ఎన్నికల సంఘం అధ్యక్షుడు ఐ.వి.సుబ్బారావును నిలదీశారు. అంతేగాక యుపిఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి అధికారులను ఆదేశించి ఓటరు జాబితా నుంచి తన పేరు తొలగించారని పాల్ ఆరోపించారు. అయితే పాల్..గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని తన అన్న డేవిడ్‌రాజు ఇంట్లో ప్రస్తుతం పాల్ ఉండటం లేదని అందువల్లనే అధికారులు పేరు తొలగించారని ఐ.వి.సుబ్బారావు వివరణ ఇచ్చారు. అయినా కె.ఎ.పాల్ ఈవిషయమై సుబ్బారావుతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు కె.ఎ.పాల్‌ను అరెస్టుచేశారు.