అల్లు అరవింద్ పై దుష్ప్రచారం: చిరు
హైదరాబాద్: తన బావ మరిది అల్లు అరవింద్ టికెట్లు అమ్ముకున్నారనే ఆరోపణల్లో నిజం లేదని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అన్నారు. కావాలనే అల్లు అరవింద్ పై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. టిక్కెట్ల కేటాయింపులో పూర్తి పారదర్శకంగా వ్యవహరించామని, సర్వేల ఆధారంగానే టిక్కెట్లు ఇచ్చామని చిరంజీవి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఆదివారం ఏర్పాటైన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పార్టీ టిక్కెట్ల విషయంలో అల్లు అరవింద్ ఎలాంటి అవకతవకలు చేయలేదని ఇది కోవర్టులు, పార్టీ వ్యతిరేకుల దుష్ప్రచారమని ఆయన అన్నారు. 104 సీట్లు బీసీలకు ఇచ్చి సామాజిక న్యాయంలో తాము చరిత్ర సృష్టించామని ఆయన అన్నారు.
ఆంజనేయరెడ్డి ఎంతో మంచివ్యక్తి, నిజాయితీ గలిగినవారని, నీతి నిబద్ధత గల వ్యక్తి అని, అలాంటి ఆంజనేయ రెడ్డి పార్టీని వీడతాననటం తనకు షాక్ అని అన్నారు. ఆంజనేయరెడ్డికి క్షమాపణలు చెప్పి తిరిగి పార్టీలోకి ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు. అభిమానసంఘాల నేతల రాజీనామాలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నాళ్లుగా తన వెంట ఉన్నవారు ఇలా ప్రవర్తించటం మనసుకు కష్టం కలిగించిందని రాజకీయాలు మనుషుల్లో అనుబంధాలను ఇంతలా దూరం చేస్తాయని తనకు ఇప్పటివరకు తెలియదని అన్నారు. పవన్ కల్యాణ్‌కు పదవులపై ఆశ లేదని, పవన్ సమాజానికి ఉపయోగపడే వ్యక్తి అని అన్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయ భవితవ్యం ప్రజల చేతుల్లోనే ఉందని అన్నారు.












Click it and Unblock the Notifications