వైయస్ పై 'మహా' నేతల ధ్వజం

కాంగ్రెస్ చేపట్టిన ప్రాజెక్టుల్లో అవినీతి పేరుకు పోయిందని,19 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయం గల ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు వ్యయాన్ని రాత్రికి రాత్రి 38 వేల కోట్ల రూపాయలకు పెంచారని చంద్రబాబు ఆరోపించారు. హైదరాబాదులో లక్ష కోట్ల రూపాయల విలువచేసే భూములు అన్యాక్రాంతం అయిపోయాయని ఆయన అన్నారు. 2004లో తెరాసతో పొత్తు పెట్టుకుని తెలంగాణను మోసం చేసిందని, తాము చట్టపరంగా, రాజకీయంగా తెలంగాణను సాధించేందుకు కృషి చేస్తామని ఆయన చెప్పారు.తాము ఎన్నికల్లో చేసిన హామీలను అమలు చేసి తీరుతామని ఆయన చెప్పారు.
మహాకూటమి రథచక్రాల కింద ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అహంభావం, కాంగ్రెస్ ప్రభుత్వం నలిగిపోవడం ఖాయమని తెరాస అధినేత కె.చంద్రశేఖరరావు అన్నారు. మోసాలు చేయడంలో, అబద్ధాలు చెప్పడంలో రాజశేఖర రెడ్డి ఆల్ ఇండియా రికార్డులు బద్దలు కొట్టాడని ఆయన వ్యాఖ్యానించారు. వైయస్ రాజశేఖర రెడ్డి తన పాలనలో అన్ని వర్గాలను మోసం చేశాడని ఆయన అన్నారు.
లక్ష కోట్ల విలువైన భూములను ప్రభుత్వం బడా బాబులకు అప్పగించిందని, ఈ మొత్తంతో నెలకు రూ.2 వేలకు బదులుగా రూ.4 వేలు ఇవ్వవచ్సని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు అన్నారు. కాంగ్రెస్ పందికొక్కులంతా కలిసి సిమెంటు, స్టీలు, గనులు సైతం మెక్కుతున్నారని, ఇది రాబందుల రాజ్యమని, బకాసురుల రాజ్యమని, రాక్షస రాజ్యమని ఆయన అన్నారు.
తమది మాయాకూటమి కాదని, వైఎస్ ప్రభుత్వాన్ని మాయంచేసే కూటమి అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ అన్నారు. నిజాం నవాబులను కూల్చిన విధంగా వైఎస్ ప్రభుత్వాన్ని కూల్చివేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. వందల వేల ఎకరాలను సంపన్నులకు దోచిపెట్టిన ప్రభుత్వం పేదలకు జానెడుస్థలం ఇవ్వలేదని విమర్శించారు. నల్లధనాన్ని సైతం తెల్లగా మార్చే శక్తిని వైఎస్ కూడపెట్టుకున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications