దర్శకుడు రామినీడు కన్నుమూత
చెన్నై: ప్రముఖ దర్శక నిర్మాత గుత్తా రామినీడు (82) బుధవారం చెన్నైలో కన్నుమూశారు. వృద్ధాప్యం వల్ల సంభవించిన అనారోగ్యంతో రామినీడు మృతి చెందినట్లు కుటుంబ వర్గాలు వెల్లడించాయి. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రామినీడు మరణ వార్త తెలిసిన వెంటనే పలువురు సినీ ప్రముఖులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. పలువురు తెలుగుచలన చిత్ర ప్రముఖులు సైతం రామినీడు భౌతిక కాయాన్ని సందర్శించడానికి హైదరాబాద్ నుంచి చెన్నైకి బయలుదేరారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని చారెపర్రులో జన్మించిన రామినీడు చిన్నతనం లోనే సినిమాలకు ఆకర్షితులయ్యారు.
సినిమాల మీద ఆసక్తి కొద్దీ చెన్నై చేరుకుని అనతి కాలంలోనే ఆ రంగంలో పట్టు సాధించారు. 1954 మొదలుకొని ఇప్పటి వరకూ ఆయన ఎన్నో విజయ వంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. కొన్ని చిత్రాలను స్వయంగా నిర్మించారు కూడా. మా ఇంటి మహాలక్ష్మి (1959), చివరికి మిగిలేది (1960), పల్నాటి యుద్ధం (1966), భక్తపోతన (1966), బంగారు సంకెళ్ళు (1968), ప్రతీకారం (1982) వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. కుటుంబ కథా చిత్రాలకు ఆయన పెద్ద పీట వేశారు. ఆయన సినిమాలు ఆంతర్లీనంగా సందేశాన్ని అందిస్తూ వినోదాన్ని పంచుతాయి.












Click it and Unblock the Notifications