స్వరార్చన: గిన్నిస్ లో చోటు
హైదరాబాద్: లక్షల మంది భక్తజనం ఒకేచోట చేరి ఆలపించిన సంకీర్తనలకు 'గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్'లో చోటు లభించింది. తొలి తెలుగు వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమాచార్యుల 601వ జయంతి సందర్భంగా సిలికానాంధ్ర, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ, తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్తంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఆదివారం రాత్రి నిర్వహించిన కార్యక్రమం లక్షగళ సంకీర్తనార్చనకు వేదికైంది. దాదాపు రెండు లక్షల మంది హాజరైన ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయకుడు బాలకృష్ణ ప్రసాద్ గళ సారథ్యంలో 1.60లక్షల మంది ముక్తకంఠంతో అన్నమాచార్య కీర్తనలను ఆలపించారు. సిలికానాంధ్ర అధ్యక్షుడు కూచిబొట్ల ఆనంద్ సంకీర్తనార్చనకు ప్రాణం పోశారు. గిన్నిస్ పుస్తకంలో 72 ఏళ్ల క్రితం నమోదైన రికార్డును తాజాగా నిర్వహించిన సంకీర్తనలు అధిగమించాయి. 1937 ఆగస్టు 2న పోలెండ్(అప్పటి జర్మనీలో భాగం)వాసులు 60వేల మంది ముక్తకంఠంతో తమ జాతీయ గీతాన్ని ఆలపించి గిన్నిస్‌లో స్థానం సంపాదించారు.
కార్యక్రమానికి హాజరైన 1.60 లక్షల మంది భక్తులు గంట వ్యవధిలో ఏడు సంకీర్తనలు ఆలపించారు. భావములోన..బ్రహ్మకడిగిన పాదము.. ఎంతమాత్రమున..పొడగంటిమయ్యా..కొండలలో నెలకొన్న..నారాయణతే నమోనమో..ముద్దుగారే యశోద కీర్తనలతో నడుమ గోవిందనామ సంకీర్తనలతో పరేడ్‌గ్రౌండ్స్ మార్మోగిపోయింది. ఒక్కసారిగా గళం విప్పిన భక్తజనంతో భాగ్యనగరం ఆధ్యాత్మికతతో పులకించింది. తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించేలా కేంద్ర మంత్రివర్గం శనివారం సూచనప్రాయంగా అంగీకరించినట్లు ఆర్థికమంత్రి కె.రోశయ్య తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన లక్షగళ సంకీర్తనార్చనకు సంకల్పించిన నిర్వాహకులను ప్రశంసించారు.
కనీవినీ ఎరగని రీతిలో భక్త సందోహం రావడం, లక్షగళ సంకీర్తనార్చనలో పాల్గొనటం వెంకటేశ్వర స్వామి మహత్యమని తితిదే ఛైర్మన్ ఆదికేశవులనాయుడు చెప్పారు. అన్నమయ్య జన్మించిన తాళ్లపాకలో 108 అడుగుల ఆయన విగ్రహాన్ని స్థాపించామన్నారు. అన్నమయ్య జయంతి సందర్భంగా అక్కడ మూడు రోజులుగా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. తితిదే, రాష్ట్ర ప్రభుత్వాలు చక్కటి ప్రదర్శన నిర్వహించాయని గిన్నిస్ పుస్తకం అధికార ప్రతినిధి రేమండ్ మార్షల్ చెప్పారు. లక్షల మంది ఉత్కంఠతో ఎదురు చూస్తుండగా లక్షగళ సంకీర్తనార్చన కార్యక్రమం గిన్నిస్‌లో చోటు సాధించిందని ప్రకటించారు. ఇది అరుదైన కార్యక్రమంగా గుర్తించామన్నారు. గిన్నిస్ ధ్రువీకరణ పత్రాన్ని ఆయన రోశయ్యకు అందజేశారు. కార్యక్రమంలో సిలికానాంధ్ర ఛైర్మన్ కె.ఆనంద్, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, తితిదే ఈవో కె.వి.రమణాచారి, సినీ దర్శకుడు రాఘవేంద్రరావు, అక్కినేని నాగార్జున దంపతులు, రచయిత భారవి, మంత్రులు పనబాక లక్ష్మి, మండలి బుద్ధప్రసాద్ పాల్గొన్నారు.అన్నమయ్య కీర్తనలు ఆలపించే గాయని శోభరాజ్ తనకు అవమానం జరిగిందంటూ మధ్యలోనే అలిగి వెళ్లిపోయారు.












Click it and Unblock the Notifications