ఓటమికి నాదే బాధ్యత:చిరు హీరోయిజం

హైదరాబాద్‌: "సమయం సరిపోలేదు. ప్రజారాజ్యం పార్టీ ఓటమికి పూర్తిగా నేనే బాధ్యత వహిస్తున్నా. అందరూ పీఆర్పీ ఓటమిని చూస్తుంటే.. నేను మాత్రం ఓటమిలో గెలుపును చూస్తున్నాను. మహా యుద్ధంలో ఇది మొదటి అడుగు మాత్రమే. దీంతోనే డీలా పడకుండా మరింత బలోపేతమై భవిష్యత్‌ దిశగా సాగుతాం. గెలుపోటములతో నిమిత్తం లేకుండా ప్రజా సమస్యలపై పోరాడే విషయంలో 'కింగ్‌' అనిపించుకుంటాం'' అని చిరంజీవి ప్రకటించారు.

తమ లక్ష్యం 2014 ఎన్నికలని చెప్పారు. తెలంగాణ నినాదం బలహీనపడిందని అన్నారు. కేంద్రంలో స్వచ్ఛమైన పాలన ఇచ్చిన ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ ప్రభావం రాష్ట్రంపైనా పడిందని, అందుకే ఇక్కడ కూడా కాంగ్రెస్‌ తిరిగి అధికారంలోకి వచ్చిందని ఆయన విశ్లేషించారు. సామాజిక న్యాయ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో, పార్టీని బలోపేతం చేసుకోవడంలో సమయం సరిపోలేదని, తమ ఓటమికి అదే ప్రధాన కారణం అనుకుంటున్నామని తెలిపారు. ఫలితాల అనంతరం శనివారం సాయంత్రం చిరంజీవి తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.
"గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం. శిరసా వహిస్తున్నాం. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీగా పీఆర్పీని ప్రజలు తమ జీవితాల్లోకి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. వారి ఆహ్వానం మేరకే ఎన్నో కొన్ని సీట్లు వచ్చాయి. 'మార్పు', 'సామాజిక న్యాయం' నినాదానికి ఓటేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.

నాయకులు, కార్యకర్తలు, అభిమానులు... పార్టీకోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజా సమస్యలపై పోరాడతాం. రేపటి నుంచి మహా యుద్ధానికి మొదటి రోజు ప్రారంభమవుతుంది'' అని ఆయన అన్నారు. పాలకొల్లులో ఎందుకు ఓడిపోయారన్న ప్రశ్నకు మహామహులూ ఓటమికి అతీతులు కాదు. ఇందిరాగాంధీ, పీవీ, ఎన్టీఆర్‌ అంతటివారికే ఓటమి తప్పలేదన్నారు.
ఈ ఎన్నికల్లో డబ్బు ప్రభావం కచ్చితంగా ఉందని చెప్పారు. ఇకపై సినిమాల్లో నటించనని, పూర్తిగా రాజకీయాల్లోనే ఉంటానని అన్నారు. అవినీతి అన్నది వారి జీవితాలపై ఎంతటి ప్రభావం చూపుతోందన్నది ప్రజలు ఇంకా గ్రహించలేదని వ్యాఖ్యానించారు. 'ఈ ఓటమిని ఒక గురువుగా తీసుకుంటాము. ఈఎన్నికలు మాకు పాఠాలునేర్పుతాయి.పోరాటపటిమను కొనసాగిస్తాం'అని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+