విజయ్- ఉదయనిధి: ఢీ అంటే ఢీ: ఒక్క మాట మాట్లాడినా సహించేది లేదు
ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన అనంతరం తమిళనాడులో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారాయి. అధికార టీవీకేకు వ్యతిరేకంగా డీఎంకే నాయకులు రోడ్లెక్కారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగారు. రోడ్లపై బైఠాయించారు. వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. అటు టీవీకే కూడా ఏ మాత్రం తగ్గట్లేదు. ముఖ్యమంత్రి విజయ్, త్రిషపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రదర్శనలు చేపట్టారు.
విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై టీవీకే మహిళా విభాగానికి చెందిన ప్రతినిధులు తంజావూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చారు. దీని ఆధారంగా ఈ కేసు నమోదైంది. ఈ ఉదయం తంజావూరు పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. చెన్నై నీళాంకరైలోని ఆయన నివాసం నుంచి ఉదయనిధిని అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామం తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేకెత్తించింది.

ఉదయనిధి స్టాలిన్‌పై బీఎన్‌ఎస్ కింద ఏడు సెక్షన్లతో పాటు మహిళల వేధింపుల నిరోధక, ఐటీ యాక్ట్ కలిపి మొత్తం తొమ్మిది సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఉదయనిధి స్టాలిన్ అరెస్టును నిరసిస్తూ తమిళనాడు వ్యాప్తంగా డీఎంకే శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగాయి. తేనిలో మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం నేతృత్వంలో డీఎంకే కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు పెడుతోందని ఆరోపించారు.
తిరుచిరాపల్లి, రామనాథపురంలో కూడా రోడ్డు దిగ్బంధనానికి ప్రయత్నించిన డీఎంకే కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టుపై డీఎంకే ఎంపీ కనిమొళి తీవ్రంగా స్పందించారు. అధికార టీవీకే ప్రభుత్వం ప్రతిపక్ష నేతపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. వ్యక్తిగత కక్షతోనే ఉదయనిధిపై కేసు పెట్టిందని, ఈ అంశాన్ని న్యాయస్థానంలోనే తేల్చుకుంటామని స్పష్టం చేశారు.
మరోవైపు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయానికి చేరుకుని పార్టీ శ్రేణులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ అంశాన్ని ఇంతటితో ఆపకూడదని, టీవీకేను ఇరుకున పెట్టడానికి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికగా తీసుకోవాలని క్యాడర్ కు సూచించారు. కావేరీ నదీ జలాలపై గళమెత్తినందు వల్లే ఉదయనిధిని అరెస్ట్ చేశారని, దీన్ని మున్ముందు మరింత ఉధృతంగా జనంలోకి తీసుకెళ్తామని అన్నారు.
అటు టీవీకే కూడా వెనక్కి తగ్గట్లేదు. విజయ్, త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే కారణంతో చెన్నై, కోయంబత్తూర్, పెరంబూర్, తిరుచిరాపల్లి వంటి చోట్ల టీవీకే నాయకులు భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. మహిళలను కించపరిచే విధంగా అసభ్యకర పదజాలం ఉపయోగించినందుకు ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలను సహించేది లేదని టీవీకే నేత శశిరేఖ స్పష్టం చేశారు.
ఒక్క మాట మాట్లాడినందుకు ఏకంగా ప్రతిపక్ష నేత అరెస్ట్ కావడం అనేది తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమౌతోంది. మహిళలను కించపర్చే ఏ ఒక్క పరిణామాన్ని కూడా సహించబోయేది లేదని విజయ్ తేల్చి చెప్పినట్టయింది.. ఈ ఉదంతంతో. మహిళలను గానీ, ప్రత్యేకించి త్రిషను అడ్డుగా పెట్టుకుని తనను విమర్శించే వాళ్లు ఏ స్థాయిలో ఉన్నా, ఎంతటి వాళ్లయినా వదిలిపెట్టబోయే ప్రసక్తే లేదని స్పష్టం చేసినట్టయింది.













Click it and Unblock the Notifications