విపక్ష సభ్యుల సస్పెన్షన్
హైదరాబాద్: సభా కార్యక్రమాలను అడ్డుకున్న ప్రతిపక్షాల సభ్యులను శాసనసభ స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి గురువారం ఒక రోజు పాటు సస్పెండ్ చేశారు. తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), సిపిఎం, సిపిఐ సభ్యులు సస్పెన్షన్ కు గురయ్యారు. సస్పెన్షన్ అనంతరం కూడా బయటకు వెళ్లకపోవడంతో సభ్యులను మార్షల్స్ తో బయటకు పంపించారు. సస్పెన్షన్ అనంతరం ప్రతిపక్షాల సభ్యులు శాసనసభ ముందు ధర్నాకు దిగారు. వారి సస్పెన్షన్ కు శాసనసభా వ్యవహారాల మంత్రి కె. రోశయ్య తీర్మానం ప్రతిపాదించారు. 80 మంది శాసనసభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు.
ఓబుళాపురం గనుల లీజు వ్యవహారంపై సభా సంఘం వేయాలని పట్టుబడుతూ ప్రతిపక్షాల సభ్యులు సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. ఈ వ్యవహారంపైనే పది నిమిషాల పాటు సభ వాయిదా పడి తిరిగి సమావేశమైన తర్వాత కూడా సద్దుమణగలేదు. తెలుగుదేశం, తెరాస సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయసాగారు. అడ్వొకేట్ జనరల్ ను సభకు పిలిపించి సభా సంఘం వేయడానికి వీలవుతుందా లేదా అనే విషయాన్ని కనుక్కోవాలని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి, బిజెపి శాసనసభ్యుడు జి. కిషన్ రెడ్డి చేసిన విజ్ఞప్తిని కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు.












Click it and Unblock the Notifications