రాజీ ఫార్ములా: జగన్ కు కేంద్ర మంత్రి పదవి

అయితే గతంలో కూడా జగన్ కు కేంద్ర మంత్రి వర్గంలో స్థానం కల్పించేందుకు పార్టీ అధిష్టానం ముందుకు వచ్చింది. అయితే దాన్ని జగన్ అంగీకరించలేదని ప్రచారం జరిగింది. ముఖ్యమంత్రి పదవి తప్ప మరోటి అక్కర లేదనే పద్ధతిలో ఆయన వ్యవహరించారని అంటారు. ప్రస్తుత స్థితిలో కేంద్ర మంత్రి పదవికి అంగీకరించడమే మేలనే పరిస్థితికి జగన్ వచ్చినట్లు చెబుతున్నారు. వీలైతే పులివెందుల నుంచి శాసనసభకు పోటీ చేయాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ అది అంత సులభం కాదని తేలిపోయిందని అంటున్నారు. కొండా సురేఖ రాజీనామా వ్యవహారం, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో జగన్ శిబిరం వ్యవహరించిన తీరు జగన్ కు మరింత ప్రతికూలంగా మారినట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో దక్కిందే బంగారం అనే ఆలోచనకు జగన్ వచ్చినట్లు చెబుతున్నారు.
కాంగ్రెసు సీనియర్ నాయకులు కొంత మంది చేస్తున్న వ్యాఖ్యలను జగన్ శిబిరం తక్కువగా అంచనా వేసి ఎదురు దాడికి దిగడం కలిసి రాలేదని చెబుతున్నారు. పలికింది కేశవరావు, వి. హనుమంతరావు వంటి సీనియర్ నాయకులే అయినా పలికించింది అధిష్టానం అనే విషయాన్ని గుర్తించలేక జగన్ తప్పులో కాలేసినట్లు భావిస్తున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఆత్మీయ మిత్రుడు కెవిపి రామచందర్ రావు కూడా అధిష్టానానికి అణగి మణగి ఉండడమే మేలనే స్థితికి వచ్చినట్లు చెబుతున్నారు. కెవిపి లేకుండా రాజకీయాలు నడపడం ఎంత ప్రమాదమో జగన్ కు తెలిసి వచ్చిందని అంటున్నారు. దీంతో ప్రస్తుతానికి రాజీయే మేలని భావించి దిగి వచ్చేందుకు ఆయన సిద్ధపడినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications