హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం తీవ్రమవుతున్న ప్రస్తుత తరుణంలో మాజీ హోం మంత్రి, కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు కె. జానా రెడ్డి రంగంలోకి దిగారు. తెలంగాణ కాంగ్రెసు శాసనసభ్యులతో సమావేశానికి ఆయన ఏర్పాట్లు చేశారు. తెలంగాణ కాంగ్రెసు శాసనసభ్యులందరికీ ఆయన ఫోన్ లు చేసి సమావేశానికి ఆహ్వానిస్తున్నారు. ఇదే సమయంలో మరో మాజీ మంత్రి, కాంగ్రెసు శాసనసభ్యుడు ఆర్. దామోదర్ రెడ్డి తమ ఇంటికి రావాల్సిందిగా ఆయన ఆహ్వానించారు. ఈ స్థితిలో సోమవారం మధ్యాహ్నం దామోదర్ రెడ్డి నివాసంలో తెలంగాణ కాంగ్రెసు శాసనసభ్యుల సమావేశం జరిగే అవకాశాలున్నాయి.
తెలంగాణ శాసనసభ్యులను కూడగడుతున్న మాట నిజమేనని, తామంతా కలిసి తెలంగాణ కోసం తగిన నిర్ణయం తీసుకుంటామని ఆలేరు కాంగ్రెసు శాసనసభ్యుడు బిక్షపతి ఒక టీవీ చానెల్ తో చెప్పారు. తమ ఏకైక లక్ష్యం తెలంగాణ సాధని ఆర్. దామోదర్ రెడ్డి అన్నారు. తెలంగాణ కోసం రాజీనామా చేసే తొలి ప్రజాప్రతినిధిగా తానే ఉంటానని, పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తెస్తామని ఆయన చెప్పారు. జానారెడ్డి, తాను ఏర్పాటు చేసే సమావేశం ఒక్కటేనని దామోదర్ రెడ్డి చెప్పారు.