హైదరాబాద్: నాటకీయ పరిణామాల మధ్య కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ సోమవారం మధ్యాహ్నం హైదరాబాదులోని నిజాం వైద్య విజ్ఞాన సంస్థకు చేరుకున్నారు. దీంతో 15 గంటల హైడ్రామాకు తెర పడింది. విజయవాడలోనే లగడపాటి ఉన్నట్లు ఇటీవలి దాకా వార్తలు వస్తున్నాయి. అయితే అకస్మాత్తుగా ఆయన సోమవారం ఒంటి గంటన్నరకు నిమ్స్ కు చేరుకున్నారు. ఆయన వెనక గేటు నుంచి నిమ్స్ లోకి అడుగు పెట్టి ఐసియులోకి పరుగులు తీశారు.
లగడపాటి హైదరాబాదుకు రావచ్చుననే ప్రచారం జరుగుతుండడంతో అప్పటికే నిమ్స్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మీడియా ప్రతినిధులు కూడా పెద్ద యెత్తున అక్కడికి చేరుకున్నారు. అయితే వారెవరికీ కంటబడకుండా ఆటోలోంచి దిగి నిమ్స్ లోకి వెనక గేటులోంచి లోని వెళ్లారు. లగడపాటి విజయవాడ ఆస్పత్రి నుంచి మాయమై నూజివీడు, ఖమ్మంల మీదుగా ఆయన హైదరాబాదుకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఐసియులో లగడపాటికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి