హైదరాబాద్: తమ మంత్రి పదవికి, శాసనసభ సభ్యత్వానికి ఐటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజీనామా చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను కొందరు పగటి వేషధారులు అడ్డుకోవడంతో మనస్తాపం చెంది తాను రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. తిరుపతి నుంచి హైదరాబాద్ వచ్చిన వెంటనే ఆయన రాజీనామా చేశారు. తెలంగాణపై రాజీనామా చేసిన తొలి మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి కావడం విశేషం. కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ వంటి వ్యాపారులు మాత్రమే తెలంగాణను అడ్డుకుంటున్నారని, సీమాంధ్రలో జరిగింది ప్రజల ఉద్యమం కాదని ఆయన అన్నారు. వందల ఎకరాలు తెలంగాణలో కబ్జా చేసిన వారే తెలంగాణను అడ్డుకుంటున్నారని ఆయన అన్నారు.
మిగతా తెలంగాణ మంత్రులు రాజీనామాలు చేయాలని తాను కోరడం లేదని, అది వారి వ్యక్తిగత విషయమని ఆయన అన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నామని సోనియా గాంధీ చెప్పిన రోజు తాను రాజీనామా చేస్తానని నల్లగొండ ప్రెస్ క్లబ్ లో చెప్పానని, దానికి తాను కట్టుబడి ఉన్నానని ఆయన చెప్పారు. సోనియాపై తనకు ఇంకా నమ్మకం ఉందని, అయితే ఒత్తిడి తేవడానికి మాత్రమే తాను రాజీనామా చేశానని ఆయన చెప్పారు. రాజీనామా తన వ్యక్తిగతమని ఆయన చెప్పారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి