హైదరాబాద్: తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం తీసుకునే రాజ్యాంగబద్ధమైన చర్యలకు అందరూ సహకరించాలని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కోరారు. కాంగ్రెసు 125వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయం గాంధీభవన్ లో సోమవారం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య రాగద్వేషాలను రెచ్చగొడుతుండడం విచారకరమని ఆయన అన్నారు. ప్రాంతాల మధ్య విద్వేషాలు పెరగకుండా చూడాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీలపై ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్దంగా చేయాల్సింది చేస్తుందని ఆయన చెప్పారు.
పార్టీని బలహీనపరిచే చర్యలను కార్యకర్తలు ప్రోత్సహించకూడదని ఆయన అన్నారు. దురదృష్టవశాత్తు తాము సమర్థుడైన వైయస్ రాజశేఖర రెడ్డిని కోల్పోయామని ఆయన అన్నారు. పార్టీకి ఇబ్బంది కలగకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల పార్టీ నాయకులు వ్యవహరించాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె. రోశయ్యతో పాటు మంత్రులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. దివంగత నేత పి. జనార్దన్ రెడ్డికి కూడా డిఎస్ నివాళులు అర్పించారు. ఆయన రెండో వర్ధంతి సందర్భంగా ఆయన ఈ నివాళులు అర్పించారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి