న్యూఢిల్లీ: తాను ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని కోరుకుంటున్నట్లు జై ఆంధ్ర ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి, కాంగ్రెసు నాయకుడు వసంత నాగేశ్వర రావు చెప్పారు. తాను 1972 నుంచి ప్రత్యేకాంధ్ర రాష్ట్రం కోసం ఉద్యమం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు తన నివాసంలో ఇచ్చిన విందు అనంతరం సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను హైదరాబాద్ ను కూడా కోరడం లేదని ఆయన చెప్పారు. ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా ఏర్పడే వరకు హైదరాబాదును ఫ్రీజోనుగా ఉంచాలని మాత్రమే తాను అడిగినట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్ తమకు అక్కరలేదని ఆయన అన్నారు. కొంత మంది హైదరాబాదులో పెట్టుబడులు పెట్టినవారు హైదరాబాద్ కావాలని అడుగుతున్నారని ఆయన అన్నారు.
ప్రత్యేకాంధ్ర రాష్ట్రం కావాలంటూ ఉద్యమం చేయడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారని, వారంతా తనతో మాట్లాడారని, అవసరం వచ్చినప్పుడు వారి పేర్లను వెల్లడిస్తానని ఆయన చెప్పారు. ప్రత్యేకాంధ్ర కోసం తాను రాయలసీమ, కోస్తాంధ్రల్లో పర్యటిస్తానని ఆయన చెప్పారు. అమలాపురం పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ కూడా ప్రత్యేకాంధ్ర రాష్ట్రాన్ని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. తాను గత మూడు రోజులుగా ఢిల్లీలో ఉన్నట్లు, కాంగ్రెసు కోర్ కమిటీతో తన అభిప్రాయాలను పంచుకున్నట్లు ఆయన తెలిపారు. సమైక్యాంధ్ర ఉద్యమం తెలుగుతల్లి గర్భసంచిలోంచి పుట్టుకొచ్చాయని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ చేసిన ప్రకటనను మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా మిగతా ఉద్యమాలు కూడా తెలుగు తల్లి గర్భసంచిలోంచే పుట్టుకొచ్చాయని ఆయన వ్యాఖ్యానించారు. తనకు కావాల్సింది ప్రత్యేకాంధ్ర రాష్ట్రమేనని ఆయన పదే పదే చెప్పారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి