వరంగల్ లో ధూం ధాంగా 'ప్రవాసి తెలంగాణ దివస్'

కార్యక్రమంలో అందెశ్రీరాసిన జయజయహే తెలంగాణ పాటను దృశ్య నృత్యరూపకంగా ప్రదర్శిస్తూ ప్రారంభించగా పాటముగిసే వరకు వేదికపై ఉన్న టీడీఎఫ్ సభ్యులు నిలబడి తమ అభిమానాన్ని, గౌరవాన్ని చాటుకున్నారు. అనంతరం నేర్నాల కిశోర్ బృందం తెలంగాణ అమరవీరులకు నివాళులర్పిస్తూ పాటలుపాడారు. పాడుదాం డప్పుల్లో దరువెయ్‌రా పల్లె తెలంగాణ పాట పాడుదాం.. అంటూ ఆలేరు విజయ, ఇచ్చినట్టు ఇచ్చిండ్లు ఢిల్లీ దొరలు..అంటూ పి.కిశోర్, తరగని సంపద ఉన్న నా తెలంగాణ నిరుపేదైతివా తెలంగాణ.. అంటూ రాజు, వీర తెలంగాణ ముక్కోటి గొంతుకల ఒక్కటైనా వీణ.. అంటూ వల్లంపట్ల నాగేశ్వర్‌రావు, వందనాలు వందనాలు అమరవీరులకు అంటూ రమాదేవి, పచ్చల్లమ్మూతూ వచ్చిరో నా తెలంగాణ పల్లేకు.. వామ్మో ఈ వలస వాదులు.. అంటూ గోదావరిఖని సిసింద్రీ పద్మావతి, ఎందుకెడుస్తున్నావ్ లంబాడోల్ల చెల్లమ్మా అంటూ కిశోర్, ఏం జరుగుతున్నదో నా పల్లె తెలంగాణలో.. అంటూ దండె శ్రీనివాస్, లడాయి అరే లడాయి చేద్దాము.. అంటూ పల్లం రవి పాడిన పాటలు ఊర్రూతలూగించాయి.
1969 తెలంగాణ పోరాటంలో అసువులు బాసిన విద్యార్థులను స్మరిస్తూ దరువు అంజన్న రాసిన పాటను దృశ్యరూపకంగా ప్రదర్శించగా ప్రేక్షకుల కండ్లు చమర్చాయి. వివిధ పాత్రలలో నిజాం, కాకతీయ ప్రభువు, హరిదాసులు, పల్లె జానపద కళాకారులు కొమురంభీం, రాణిరుద్రమ తదితర వేషధారణాలతో దృశ్యరూపకాల్లో కళాకారులు పాల్గొన్నారు. టీడీఎఫ్ సభ్యులు కరుణభేరి నృత్యాలు చేయడం, స్టేజి కింది భాగంలో విద్యార్థులు నృత్యాలు చేసి రక్తి కట్టించారు. అడుగడుగునా స్టేజి మీది కళాకారులకు, చూస్తున్న వారికి మధ్య ఒకే పోరాట స్ఫూర్తి. అరమరికల్లేని చిందులు. తెలంగాణ రావాలంటూ బందోబస్తు పోలీసులు కూడా లీనమైపోవడం విశేషం.