న్యూఢిల్లీ: తెలంగాణ ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసే వరకు వెనక్కి తగ్గబోమని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియపై స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు తెలంగాణ మంత్రులు రాజీనామాలు ఉపసంహరించుకోబోరని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. తాము వీరప్ప మొయిలీని, ఇతర అధిష్టానం నాయకులను కలుస్తామని, తమ వినతికి పార్టీ అధిష్టానం సానుకూలంగా ప్రతిస్పందిస్తుందని ఆశిస్తున్నామని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై పార్టీ అధిష్టానం నుంచి స్పష్టమైన ప్రకటనను కోరడానికి తెలంగాణకు చెందిన మంత్రులు ఆదివారం ఢిల్లీ వచ్చారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిర్దిష్టమైన గడువు కావాలని ఆయన అన్నారు. తెలంగాణపై స్పష్టత, కాల పరిమితి లేకపోతే తమ రాజీనామాలు ఉపసంహరించుకోబోమని ఆయన చెప్పారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు తదితరులు కూడా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి