హైదరాబాద్: తమ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తున్న రాష్ట్ర ఐటి మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఆరాధించిన నాయకుడు ఢిల్లీ నుంచి గల్లీ దాకా సమైక్యాంధ్ర నినాదం వినిపిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకుడు రావుల చంద్రశేఖర రెడ్డి ఎద్దేవా చేశారు. వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయకపోతే మంత్రి పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రగల్భాలు పలికారని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు. అటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమపై విమర్సలు చేయడం తగదని ఆయన అన్నారు. తెలంగాణ ఇచ్చేది కాంగ్రెసు పార్టీయేనని కోమటిరెడ్డి అంటున్నారని, తెలంగాణ మంత్రులు రాజీనామాలు ఎవరికి ఇచ్చారో, ఎందుకు ఇచ్చారో, ఎందుకు ఉపసంహరించుకున్నారో కోమటిరెడ్డికి తెలియదని ఆయన అన్నారు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ మహబూబ్ నగర్ జిల్లాకు ఇంచార్జీ మంత్రిగా ఉన్నారని, అయినా తమ జిల్లాకు చేసిందేమీ లేదని ఆయన అన్నారు. తమ తెలుగుదేశం పార్టీ నాయకులను వ్యక్తిగతంగా విమర్శించడానికి, ఆడిపోసుకోవడానికి మాత్రమే కోమటిరెడ్డి పరిమితమవుతున్నారని ఆయన విమర్శించారు. ఢిల్లీకి వెళ్లి తెలంగాణ మంత్రులు ఒరగబెట్టేందేమీ లేదని, వారికి కాంగ్రెసు అధిష్టానం నేతల అపాయింట్ మెంటు కూడా దొరకలేదని, వారికి దొరికిందల్లా కె. కేశవరావు అపాయింట్ మెంటు మాత్రమేనని ఆయన అన్నారు. నాగం జనార్దన్ రెడ్డిపై కోమటి రెడ్డి పనికి మాలిన మాటలు మాట్లాడితే సహించబోమని ఆయన అన్నారు. తాము తెలంగాణ రాష్ట్ర సాధనకు చిత్తశుద్ధితో కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు. సమస్యను పరిష్కరించాల్సింది కాంగ్రెసు పార్టీయేనని, పార్టీలను ఇబ్బంది పెట్టింది కూడా కాంగ్రెసు పార్టీయేనని ఆయన అన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి