కర్నూలు: కర్నూలు జిల్లా పత్తికొండ తెలుగుదేశం శాసనసభ్యుడు కెఇ ప్రభాకర్ ను పోలీసులు సోమవారం ఉదయం అరెస్టు చేశారు. కృష్ణగిరి సింగిల్ విండో ఎన్నికల్లో ఎన్నికల అధికారులపై దౌర్జన్యానికి దిగిన కేసులో పోలీసులు ఆయనను అరెస్టు చేసి డోన్ కు తరలించారు. ఆయనను అరెస్టు చేసే సమయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పెద్ద యెత్తున పోలీసులు ఆయన ఇంటిని చుట్టుముట్టారు. ఈ సమయంలో అరెస్టును అడ్డుకునేందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రయత్నించారు.
కో-ఆపరేటివ్ సొసైటీ డివిజన్ అధికారి నాగలింగేశ్వరిపై, సబ్ ఇన్ స్పెక్టర్ పై దౌర్జన్యం సంఘటనలో కృష్ణగిరి పోలీసు స్టేషన్ లో కెఇ ప్రభాకర్ పై కేసులు నమోదయ్యాయి. 149, 143, 448, 353, 506 సెక్షన్ల కింద ఆయనపై కేసులు నమోదయ్యాయి.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి