కాళ్ళ నరాల నొప్పులా.. ఇవే కారణాలు, అసలే నిర్లక్ష్యం చెయ్యొద్దు!
కాళ్లలో మంట, తిమ్మిర్లు, కుట్టినట్టు నొప్పి, బలహీనత వంటి సమస్యలతో చాలామంది బాధపడుతుంటారు. ఇవి చాలా మందికి సాధారణంగా అనిపించే సమస్యలుగా అనిపించినా ఇవి ఈజీగా తీసుకునే సమస్యలు కాదు. చాలామంది దీనిని సాధారణ కండరాల నొప్పి అనుకొని నిర్లక్ష్యం చేస్తారు. కానీ ఇది నరాల సమస్య. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారిలో ఇది ప్రమాదకరం. ఒకవేళ డయాబెటిస్ ఉంటే దీనిని డయాబెటిక్ న్యూరోపతి అంటారు.
నరాల నొప్పిని నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది?
కాళ్ళ నరాలు నొప్పిని పొరపాటున కూడా నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం చేస్తే మన పాదాలలో ఏం జరుగుతుందో మనకు అర్థం కాని పరిస్థితి వస్తుంది. పాదాలు స్పర్శ జ్ఞానాన్ని కోల్పోతాయి. పుండ్లు, ఇన్ఫెక్షన్లు, కాలి వేళ్లు తీసేయాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. కాబట్టి ముందుగానే గుర్తించి డయాబెటిక్ న్యూరోపతికి చికిత్స తీసుకోవాలి.

డయాబెటిక్ న్యూరోపతితో కాళ్ల నరాల నొప్పులు
డయాబెటిస్ ఉన్నవారిలో అత్యంత సాధారణంగా డయాబెటిక్ న్యూరోపతి వస్తుంది. రక్తంలో షుగర్ ఎక్కువ కాలం ఉండటం వల్ల నరాలు దెబ్బతిని నొప్పి, మంట, తిమ్మిర్లు వస్తాయి. షుగర్ కంట్రోల్‌లో ఉన్నా కూడా కొన్ని సంవత్సరాల తర్వాత ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది.
విటమిన్ బి12 లోపంతోనూ, ఈ సమస్యలతోనూ కాళ్ల నరాల నొప్పులు
శాకాహారులు, వయసు పైబడినవారు, కొన్ని మందులు వాడేవారిలో బి12 లోపం ఎక్కువగా ఉంటుంది. ఇది నరాలను బలహీనపరుస్తుంది. డిస్క్ స్లిప్, సయాటికా, స్పైనల్ స్టెనోసిస్ వల్ల నరాలపై ఒత్తిడి పడి కాళ్లలో విపరీతమైన నొప్పి వస్తుంది. థైరాయిడ్ హార్మోన్ తక్కువగా ఉంటే కూడా నరాలు ప్రభావితం అవుతాయి. దీని వల్ల కూడా నరాల నొప్పి వస్తుంది.
వీరిలోనూ కాళ్ళ నరాల నొప్పులు
ఎక్కువగా మద్యం సేవించడం వల్ల నరాలు దెబ్బతినడం సాధారణం. ఎక్కువగా మద్యం సేవించే వారిలోనూ నరాల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. కిడ్నీ సమస్యలతో బాధపడే వారిలోనూ, క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్న వారిలోనూ, వైరల్ ఇన్ఫెక్షన్లతో బాధపడే వారిలోనూ, ఆటో ఇమ్యూన్ డిసీజ్ లతో బాధపడే వారిలోనూ కాళ్ల నరాల నొప్పుల సమస్య వచ్చే అవకాశం ఉంది.
రెండు వారాలు కంటే ఎక్కువగా ఉంటే ఇలా చెయ్యండి
అయితే కాళ్ల నరాల నొప్పుల సమస్య రెండు వారాలు కంటే ఎక్కువగా ఉంటే అసలు నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే వైద్యుని వద్దకు వెళ్లి సంబంధిత పరీక్షలు చేయించుకొని, దానికి అనుగుణంగా మందులు వాడాల్సి ఉంటుంది. అంతేకాదు ప్రతిరోజు 30 నుండి 40 నిమిషాల పాటు నడవడం మంచిది.
కాళ్లు ఆరోగ్యంగా ఉంటే శరీరం ఆరోగ్యంగా
మంచి బ్యాలెన్స్డ్ డైట్, ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాటు చేసుకుంటే కాళ్ల నరాల నొప్పులు కాస్త ఉపశమనాన్ని ఇస్తాయి. అందుకే నిర్లక్ష్యం చేయకుండా వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోండి. ఎందుకంటే మన శరీరంలో కాళ్లు చాలా ప్రధానమైనవి. కాళ్లు ఆరోగ్యంగా ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉన్నట్టే!













Click it and Unblock the Notifications