తెలంగాణ మంత్రులు ఏం సాధించారు: నాగం జనార్దన్ రెడ్డి
State
oi-Pratapreddy
By Pratap
|
హైదరాబాద్: ఏం సాధించారని తెలంగాణ మంత్రులు పదవుల్లో కొనసాగుతున్నారని తెలుగుదేశం పార్టీ తెలంగాణ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ మంత్రులు ఎందుకు తగ్గుతున్నారో చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఇప్పటి వరకు తెలంగాణకు చెందిన 42 మంది శాసనసభ్యులు రాజీనామాలు చేయలేదని, వారెవరో గుర్తించి వారి చేత రాజీనామాలు చేయించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. రాజీనామాల ఆమోదానికి స్పీకర్ పై ఒత్తిడి తెచ్చి ఆమోదింపజేసుకుని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, తద్వారా రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టించి తెలంగాణను సాధించుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.
కేంద్ర ప్రభుత్వంపై, తమ పార్టీ అధిష్టానంపై తమకు నమ్మకం కుదిరిందని తెలంగాణ మంత్రులు చెబుతున్నారని, వారికి అధిష్టానం ఏం చెప్పిందో ప్రజలకు చెప్పాలని, దాని వల్ల ఆందోళనలు తగ్గుతాయని ఆయన అన్నారు. రాష్ట్రపతి పాలనకు తాము భయపడడం లేదని ఆయన అన్నారు. ఇద్దరు మంత్రులు రాజీనామా చేస్తే ఎవరూ మాట్లాడడం లేదని, సినిమాలను అడ్డుకోవడంపై మాత్రం దృష్టి పెడుతున్నారని, దేనిపై దృష్టి పెట్టాలో దానిపై పెట్టడం లేదనేది దీనివల్ల అర్థమవుతోందని ఆయన అన్నారు. వినోద పరిశ్రమను అడ్డుకోవడం సరి కాదని ఆయన అన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి