దేవీపట్నం: పట్టిసీమ, పాపికొండల మధ్య నడిచే టూరిజం లాంచి పర్యాటకులకు మరపురాని అనుభూతులను మిగిల్చేది. ఆ బోటే కాదు లాంచీలను కూడా పదిరోజులపాటు నడపరాదని ఆదేశాలు వచ్చాయి. గోదావరి నదిలో నీటిమట్టం బాగా తగ్గిపోవడంతో ఇటీవల తరచుగా ఇసుకతిన్నెల్లో బోట్లు కూరుకుపోతున్న నేపథ్యంలో పాపికొండల పర్యటనకు వెళ్లే బోట్లు, లాంచీలపై సోమవారం నుంచి నిషేధం విధించారు. ధవళేశ్వరం ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు విప్పర్తి వేణుగోపాల్ ఆదేశాల మేరకు వీటి ప్రయాణాలు నిషేధిస్తున్నట్టు బోటు సూపరింటెండెంట్ ఆర్.విశ్వనాథరాజు ఆదివారం విలేకర్లకు తెలిపారు. తరచూ పర్యాటక బోట్లు ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో ఇరిగేషన్, పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు సమావేశమై ఈ నిషేధాన్ని ప్రకటించారు. బంగారమ్మపేట సమీపంలో శుక్రవారం సింధుగౌతమి పర్యాటక బోటు ఇసుకతిన్నెల్లో కూరుకుపోయిన సంగతి తెలిసిందే.
దాంతో శనివారం పశ్చిమగోదావరి జిల్లా వాడపల్లి నుంచి పర్యాటక బోట్లను అధికారులు అనుమతించారు. అయితే శనివారం అర్ధరాత్రి పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడి సమీపంలో రాజమండ్రి యూనియన్‌కు చెందిన లాంచీలు చిక్కుకుపోయి పర్యాటకులు ఇబ్బందులు పడ్డారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని పదిరోజులపాటు నిషేధం విధిస్తున్నట్టు విశ్వనాథరాజు అన్నారు. పర్యాటకుల యోగక్షేమాల దృష్ట్యా ఈ నిషేధాన్ని అమలు చేస్తున్నట్టు విశ్వనాథరాజు పేర్కొన్నారు. పర్యాటక బోట్లు, లాంచీలు పర్యాటకులను తరలించే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. తిరిగి ఎప్పుడు అనుమతి ఇచ్చేదీ రెవెన్యూ, పోలీసు, ఇరిగేషన్ శాఖల అధికారులు లాంచీల, బోట్ల యజమానులతో సమావేశమై చర్చించి ప్రకటన విడుదల చేస్తామన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి