ట్రోపోస్ఫియర్ లో తీవ్ర గాలులు: ఏపీలో ఈ జిల్లాల్లో వర్షాలు
ఏపీలో రోజురోజుకూ ఎండ తీవ్రత పెరుగుతోంది. జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే స్థాయిలో ఉష్ణోగ్రత నమోదవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వడగాలులు వీస్తోన్నాయి. మరింత ఇబ్బందులకు గురి చేస్తోన్నాయి. ప్రత్యేకించి రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వేడిగాలులు, ఉష్ణోగ్రత పంజా విసురుతున్నాయి. ఈ పరిస్థితుల మధ్య కొద్దిరోజులుగా రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడుతున్నాయి. ఈదురుగాలులు వీస్తోన్నాయి. ఉపశమనాన్ని కలిగిస్తోన్నాయి.
ఇదే పరిస్థితి.. నేడు కూడా కొనసాగనుంది. ట్రోపోస్ఫియర్ లో తీవ్ర గాలులు వీస్తోండటం దీనికి కారణం. దీని ప్రభావంతో బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత స్వల్పంగా తగ్గి ఆకాశం మేఘావృతమై ఉంటుందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. వాతావరణం కొంత చల్లగా మారుతుందని, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

ట్రోపోస్ఫియర్ లో వీస్తోన్న గాలుల ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మరో రెండు రోజులు పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. నేడు ఉత్తరాంధ్ర నుండి రాయలసీమ వరకూ అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడొచ్చు. పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలకు అవకాశాలు లేకపోలేదు.
అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఉరుములు, మెరుపులు వచ్చేటప్పుడు చెట్ల కింద, పొలాల్లో ఉండకూడదని, సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని సూచించారు.
మరోవైపు అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలంలో తీవ్రవడగాలులు, అలాగే ముంచింగిపుట్టు,పెదబయలు, గోకవరం, చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, గుర్తేడు మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది. గురువారం అత్యధికంగా పోలవరం జిల్లా వీఆర్ పురంలో 41.7 డిగ్రీల ఉష్ణోగ్రత, అల్లూరి గంపరాయిలో 21.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.












Click it and Unblock the Notifications