హైదరాబాద్: తెలంగాణ కోసం ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుడు, శాసనసభ్యుడు హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. వేణుగోపాల్ రెడ్డి అనే విద్యార్థి తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ఆయన మంగళవారం ఆ విజ్ఞప్తి చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి మృతదేహాన్ని ఆయన సందర్శించారు. తాము విద్యార్థులకు అండగా ఉంటామని, ఈ నెల 28వ తేదీని తెలంగాణకు డెడ్ లైన్ పెట్టామని, ఆలోపు తెలంగాణపై కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోతే మూకుమ్మడి రాజీనామాలు చేసి పోరాటానికి దిగుతామని ఆయన చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం సాధ్యమైనంత త్వరగా ఏర్పడాలన్నదే అందరి ఆకాంక్ష అని ఆయన అన్నారు. అందరం కలిసి తెలంగాణను సాధించుకుందామని ఆయన విద్యార్థులకు పిలుపునిచ్చారు. విద్యార్థుల ప్రాణాల ముందు రాజకీయ నాయకుల ప్రాణాలు ముఖ్యం కాదని ఆయన అన్నారు. వేణుగోపాల్ రెడ్డి బలిదానం తర్వాతనైనా రాజీనామా చేయని తెలంగాణ ప్రజాప్రతినిధులు ఆలోచించుకోవాలని ఆయన కోరారు. రాజీనామాలు చేసి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తెలంగాణను సాధించుకుందామని ఆయన కోరారు. వేణుగోపాల్ మృతదేహాన్ని చూసి ఆయన కంట తడి పెట్టారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి