విహారయాత్రలో విషాదం.. పడవ మునిగి ఏడుగురు మృతి, 15 మంది గల్లంతు
మధ్యప్రదేశ్ లో భారీ పడవ ప్రమాదం జరిగింది. విహారయాత్రకు వెళ్లిన వారికి తీరని శోకం మిగిలింది. తుపాను కారణంగా నర్మదా నదిలో ప్రయాణిస్తున్న విహార నౌక మునిగింది. దాంతో పడవలోని 35 నుంచి 40 మంది నదిలో మునిగిపోయారు. అయితే వారిలో ఇప్పటివరకూ ఏడుగురు మృతి చెందారు. దాదాపు 18 మందిని పోలీసులు సురక్షితంగా కాపాడారు. మరో 15 మంది గల్లంతైనట్లు సమాచారం. భారీ తుపాను కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. గల్లంతైన వారికోసం తీవ్రస్థాయిలో గాలింపు చర్యలు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. మరోవైపు ఈ ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు. ఈమేరకు వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు ట్వీట్ చేశారు.
జబల్ పూర్ జిల్లాలోని బర్గి డ్యామ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. తుపాను కారణంగా సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గాలి వేగం పెరగడం కారణంగా ఒక్కసారిగా పడవ బ్యాలెన్స్ తప్పి మునిగిపోయింది. ఇక ఘటన సమయానికే చీకటి పడడంతో సహాయక చర్యలకు ఆలస్యం అవుతోంది. ఇప్పటికే దాదాపు 18 మందిని పోలీసులు రక్షించారు. మిగిలినవారి ఆచూకీ కోసం స్థానిక యంత్రాంగం, విపత్తు నిర్వాహణ బలగాలు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టాయి.

ఇక ఈ ఘటనపై సీఎం తోపాటు డిప్యూటీ సీఎం రాజేంద్ర శుక్లా విచారం వ్యక్తం చేశారు. ఇది హృదయవిదారక, దురదృష్టమైన ఘటన అని పేర్కొన్నారు. బాధితులకు అవసరమైన సాయం అందించాలని.. ఈ ఘటనపై దర్యాప్తు జరిపించాలని ఆదేశించారు.












Click it and Unblock the Notifications