350 కోట్ల ఏళ్ల నాటి అరుదైన రహస్యం.. నల్లటి చారల్లో దాగివున్న శతాబ్దాల రాయి!
ఈ విశాల విశ్వంలో మన భూమి ఆవిర్భవించి దాదాపు 460 కోట్ల సంవత్సరాలు దాటిందని సైన్స్ చెబుతోంది. అయితే ఈ నేల మీద అసలు జీవం ఎప్పుడు, ఎలా మొదలైందనే ప్రశ్న ఇప్పటికీ అంతుచిక్కని రహస్యంగానే ఉంది. ఈ ప్రశ్నకు అత్యంత విశ్వసనీయమైన సమాధానం ఇప్పుడు భారత గడ్డపైనే లభించింది. జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్ సమీపంలో లభ్యమైన దాదాపు 350 కోట్ల సంవత్సరాల నాటి ఒక అరుదైన రాయి.. భూగోళంపై తొలి జీవరాశి ఆనవాళ్లను ప్రపంచానికి చాటిచెబుతోంది. ఊహకూ అందని కాలం నాటి బ్యాక్టీరియా జీవించినట్లు ఆధారాలు చూపుతున్న ఈ పరిశోధన ఇప్పుడు అంతర్జాతీయంగా సైన్స్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.
జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి చెందిన ప్రముఖ మహిళా శాస్త్రవేత్త త్రిస్రోతా చౌధురి నేతృత్వంలోని భారతీయ, అంతర్జాతీయ పరిశోధకుల బృందం ఈ సంచలన విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. జార్ఖండ్‌లోని భీతర్‌దారీ గ్రామం సమీపంలో జరిపిన క్షేత్రస్థాయి పరిశోధనల్లో నలుపు, తెలుపు రంగు చారలతో కూడిన ఒక విచిత్రమైన శిల వారి కంటపడింది. ఆ రాయిలోని నల్లటి చారలను మైక్రోస్కోపిక్ లెవల్, లేజర్ రామన్ స్పెక్ట్రోస్కోపీ ద్వారా క్షుణ్ణంగా విశ్లేషించగా.. అవి శతాబ్దాల క్రితం జీవించిన సూక్ష్మజీవుల సమూహాలుగా గుర్తించారు. ఆ కాలంలో నీటి అడుగున ఏర్పడిన బ్యాక్టీరియా పొరలు కాలక్రమేణా గట్టిపడి రాయిగా మారాయని స్పష్టమైంది.

మరో ప్రయోగానికి లేని ప్రత్యేకత ఇదే!
ఇప్పటివరకు ప్రపంచంలో గ్రీన్‌లాండ్, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాల్లో అత్యంత ప్రాచీనమైన జీవ ఆధారాలు లభించినట్లు ప్రచారంలో ఉన్నప్పటికీ.. వాటి వయస్సును పరోక్ష పద్ధతుల్లో లెక్కించారు. కానీ, జంషెడ్‌పూర్ ప్రాంతంలో లభించిన ఈ శిల వయస్సును నేరుగా సైంటిఫిక్ పద్ధతుల్లో విశ్లేషించి ఇది కచ్చితంగా 349.7 కోట్ల ఏళ్ల నాటిదని నిర్ధారించారు. నేరుగా డేటింగ్ పద్ధతి ద్వారా జీవం ఆనవాళ్లను నిరూపించడం ప్రపంచంలో ఇదే మొదటిసారి కావడం విశేషం. ప్రపంచ ప్రఖ్యాత పీఎన్‌ఏఎస్ సైన్స్ జర్నల్‌లో ఈ పరిశోధన వివరాలు ప్రచురితం కావడంతో ఈ ఆవిష్కరణకు అంతర్జాతీయంగా భారీ ప్రాధాన్యత లభించింది.
అంతరిక్ష పరిశోధనలకు కొత్త ఊపిరి!
అప్పట్లో భూమి అంతర్భాగంలో తీవ్రమైన అగ్నిపర్వత పేలుళ్లు, నీటి అడుగున విపరీతమైన వేడి, రసాయనాల కలయిక ఉండేది. అంతటి అత్యంత క్లిష్టమైన వాతావరణంలో కూడా సూక్ష్మజీవులు కార్బన్ డయాక్సైడ్‌ను ఉపయోగించుకుని జీవించగలిగాయని ఈ పరిశోధన నిరూపిస్తోంది. ఇది కేవలం భూమిపై జీవం పుట్టుకను అధ్యయనం చేయడానికే కాక.. అజ్ఞాత గ్రహాలపై జీవరాశి అన్వేషణకు కొత్త తలుపులు తెరుస్తోంది. ఉదాహరణకు ఒకప్పుడు అగ్నిపర్వతాలు, నీటి జాడలు ఉన్న అంగారక గ్రహం వంటి ఇతర గ్రహాల్లో కూడా ఇలాంటి వాతావరణంలోనే జీవం ఆవిర్భవించి ఉండవచ్చనే అంచనాలకు ఈ భారతీయ శిల కీలక ఆధారంగా నిలుస్తోంది.














Click it and Unblock the Notifications