వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ ప్రమాదం: సమయం వృధా చేసిన పైలట్లు

By Santaram
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
న్యూఢిల్లీ: హెలికాప్టర్ లో సాంకేతిక సమస్య తలెత్తడం, వాతావరణం ప్రతికూలంగా ఉండడం, పైలట్లు వివేచనతో వ్యవహరించకపోవడం వల్లనే డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోయిందని అధికారికంగా వెల్లడైంది. హెలికాప్టర్‌లో హఠాత్తుగా ఏర్పడిన సాంకేతిక లోపాన్ని పరిష్కరించడంలో పైలట్లు సరిగా వ్యవహరించకపోవడం వల్లే ఘోరం జరిగిందని కేంద్ర ప్రభుత్వం నియమించిన ఆర్కే త్యాగి కమిటీ తేల్చింది. ఒక్కసారిగా కిందికి దిగిపోతున్న హెలికాప్టర్‌ను నియంత్రించడం, అప్పటి పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించడంలో విఫలమయ్యారని పేర్కొంది. సమస్య తలెత్తడం..ప్రమాదం జరగడానికి మధ్య ఉండే అత్యంత విలువైన సమయాన్ని మాన్యువల్‌లో చెక్‌ లిస్టు వెదకడానికే సరిపుచ్చారని తెలిపింది. సమస్య తలెత్తిన ఆరు నిమిషాల్లోనే హెలికాప్టర్‌ కూలిపోయిందని కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో తెలిపింది.

గత ఏడాది సెప్టెంబర్‌ 2న కర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలోని పావురాలగుట్టపై వైఎస్‌ ప్రయాణిస్తున్న బెల్‌-430 హెలికాప్టర్‌ కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఆయనతో పాటు ప్రత్యేక కార్యదర్శి పి.సుబ్రహ్మణ్యం, భద్రతాధికారి ఎ.ఎస్‌.సి.వెస్లీ, పైలట్లు ఎస్‌.కె.భాటియా, ఎం.ఎస్‌.రెడ్డి మృతి చెందారు. ప్రమాదం జరిగిన మరుసటి రోజునే దీనిపై విచారణకు కేంద్ర ప్రభుత్వం పవన్‌హాన్స్‌ హెలికాప్టర్స్‌ లిమిటెడ్‌ సీఎండీ ఆర్కే త్యాగి నేతృత్వంలో ఓ కమిటీని నియమించింది. ఇందులో త్యాగితోపాటు ఫ్లైట్‌ ఆపరేషన్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కెప్టెన్‌ ఇర్షాన్‌ అహ్మద్‌, సీనియర్‌ ఎయిర్‌ సేఫ్టీ ఆఫీసర్‌ సంజయ్‌ బ్రహ్మనే, డీజీసీఏ ఎయిర్‌ సేఫ్టీ డిప్యూటీ డైరెక్టర్‌ మనీష్‌ కుమార్‌ సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందించింది. ఈ నివేదికను వివరిస్తూ పౌర విమానయాన శాఖ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

"గాలులు కిందికి బలంగా వీస్తున్న ప్రాంతంలోకి హెలికాప్టర్‌ ప్రవేశించింది. గాలుల ఒత్తిడికి అది ఒక్కసారిగా కిందికి దిగడం ప్రారంభించింది. దాన్ని నియంత్రించటంలో పైలట్లు విఫలమయ్యారు. ప్రమాదానికి మరో రెండు అంశాలు కూడా దోహదం చేశాయి. పైలట్లు వారికి అనుమతించిన విధానంలో కాకుండా మరో విధానంలో హెలికాప్టర్‌ నడపడం ఒకటి. హఠాత్తుగా తలెత్తిన సమస్య పరిష్కారంలో పైలట్లు సరిగా వ్యవహరించలేకపోవడం రెండోది. సమస్య పరిష్కారానికి పైలట్లు మాన్యువల్‌లోని చెక్‌ లిస్టు వెదకడంతోనే విలువైన సమయాన్నంతా వృథా చేశారు.' అని కమిటీ పేర్కొంది. "సాధారణంగా రెండు అంశాల ఆధారంగా హెలికాప్టర్‌ నడపడానికి పైలట్లకు అనుమతులు ఉంటాయి. కనిపించే వాస్తవ పరిస్థితులను ఆధారం చేసుకొని నడపడం ఒక విధానం.

వాతావరణం అనుకూలించని పరిస్థితుల్లో యాంత్రికంగా దానంతట అదే నియంత్రించుకుంటూ ప్రయాణాన్ని కొనసాగించే 'ఇన్‌స్ట్రుమెంట్‌ ఫ్లయింగ్‌' ద్వారా నడపడం రెండో విధానం. రాజశేఖరరెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను పైలట్లు వారి ఇష్టానుసారం నడిపేందుకు అనుమతులు ఉన్నాయి. అందుకు భిన్నంగా వారు 'ఇన్‌స్ట్రుమెంట్‌ ఫ్లయింగ్‌' విధానాన్ని ఎంచుకొన్నారు. అనుకోకుండా సాంకేతిక లోపం తలెత్తింది. ఆ సమస్య పరిష్కారానికి అనుసరించాల్సిన విధానం ఏమిటో తెలుసుకోవడానికి 'చెక్‌ లిస్టు' కోసం వెదుకులాట ప్రారంభించారు. లోపాన్ని సరిది ద్దేందుకు పైలట్లు చేసిన హడావుడి, చెక్‌ లిస్టు కోసం వెదుకులాటలో వారి వాస్తవ దృష్టి మరలిపోయింది.

అప్పటికి ఉన్న పరిస్థితులకు తగ్గట్టుగా వివేచనతో వ్యవహరించలేకపోయారు. పరిసరాలను, వాతావరణ పరిస్థితులను గమనించడం, సరిగా అంచనా వేయడం లాంటి ముఖ్యమైన అంశాలను పట్టించుకోలేదు. దీన్ని బట్టి.. సాంకేతిక లోపం తలెత్తడం, ప్రమాదం జరగడం మధ్య ఉన్న ఆరు నిమిషాల సమయాన్నిసాంకేతిక సమస్య పరిష్కారంలోనే సిబ్బంది వినియోగించారు. ప్రమాదాన్ని అంచనా వేయలేకపోయారు' అని నివేదికలో పేర్కొన్నారు.

ప్రమాద స్థలంలో, ఏపీఏసీఎల్‌ వద్ద విచారణ కమిటీ సాంకేతిక విశ్లేషణ జరిపిందని పౌర విమానయాన శాఖ ఆ ప్రకటనలో పేర్కొంది. ఏపీఏసీఎల్‌, రాష్ట్ర ప్రభుత్వ అధికారులను కూడా కమిటీ విచారించినట్లు తెలిపింది. హెలికాప్టర్లలోని వివిధ విడిభాగాలు, వ్యవస్థల తీరును కూడా కమిటీ కూలంకషంగా పరిశీలించిందని వెల్లడించింది. "ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌, భారత వాతావరణ సంస్థ (ఐఎండీ), నేషనల్‌ ఏరోనాటికల్‌ లేబొరేటరీస్‌, డిఫెన్స్‌ మెటలర్జికల్‌ రీసెర్చ్‌ లేబొరేటరీస్‌ల నుంచి వివిధ సాంకేతిక విశ్లేషణలు, వివరాలను కమిటీ తీసుకొంది.

సీబీఐ, సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ లేబొరేటరీస్‌ కమిటీకి సహకరించాయి. ప్రమాదం జరిగిన రోజున ప్రమాద స్థలి వద్ద విద్యుత్‌ స్థితిగతుల విశ్లేషణలను 'ఇండియన్‌ ప్రెసియస్‌ లైటింగ్‌ నెట్‌వర్క్‌' అందించింది. కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్‌, ఇంజన్‌, ఎలక్ట్రానిక్‌ కంట్రోల్‌ యూనిట్‌ విశ్లేషణలో ట్రాన్స్‌పోర్ట్‌ సేఫ్టీ బోర్డు, కెనడా నేషనల్‌ ట్రాన్స్‌పోర్టు సేఫ్టీ బోర్డు, బెల్‌ హెలికాప్టర్స్‌, గుడ్‌రిచ్‌, రోల్స్‌ రాయిల్స్‌... తదితర అంతర్జాతీయ సంస్థలు కమిటీకి సహకరించాయి.' అని ఆ ప్రకటనలో వివరించారు. ఏపీఏసీఎల్‌ పనితీరు, ఇతర భద్రతా నిబంధనల అంశాలకు సంబంధించి కమిటీ చేసిన సిఫారసులు కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు ఆ ప్రకటన పేర్కొంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X