న్యూఢిల్లీ: రాష్ట్ర పరిస్థితిలపై వేసిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలు త్వరలోనే రూపొందిస్తామని కేంద్ర మంత్రి పి. చిదంబరం చెప్పారు. శుక్రవారం జరిగిన కాంగ్రెసు వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) సమావేశం వివరాలను కాంగ్రెసు అధికార ప్రతినిధి జనార్దన్ ద్వివేది మీడియా ప్రతినిధులకు వివరించారు. తెలంగాణ అంశంపై తాము తీసుకున్న చర్యలను చిదంబరం సమావేశంలో వివరించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కమిటీ విధివిధానాలను త్వరలోనే ఖరారు చేస్తామని చిదంబరం చెప్పినట్లు ఆయన చెప్పారు. తెలంగాణ అంశంపై సోనియా గాంధీ సమస్య ఉందని, దానిపై మాట్లాడాలని మాత్రమే అన్నారని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
సమావేశంలో ధరల పెరుగుదలపై చర్చించినట్లు ఆయన తెలిపారు. త్వరలో ధరలు అదుపులోకి వస్తాయని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారు. ధరలను అదుపు చేయాల్సిన అవసరం ఉందని సోనియా అన్నారు. ధరల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని, ద్రవ్యోల్బణం తగ్గిస్తామని ప్రణబ్ ముఖర్జీ హామీ ఇచ్చారు. మహారాష్ట్ర పరిస్థితిపై కూడా చర్చించినట్లు ఆయన తెలిపారు. దేశ ఐక్యతకు భంగం కలిగిస్తున్న శక్తులను బలహీన పరచాల్సిన అవసరం ఉందని సమావేశం అభిప్రాయపడినట్లు ఆయన తెలిపారు. సామాన్యుడిపై భారం వేయకుండా నిరుటి మాదిరిగానే ఈ ఏడాది బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టాలని సమావేశం నిర్ణయానికి వచ్చినట్లు ఆయన తెలిపారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి