న్యూఢిల్లీ: రాష్ట్ర పరిస్థితిపై వేసిన శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలపై ముందే అభిప్రాయాలు వద్దని కేంద్ర న్యాయశాఖ మంత్రి, కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ రాష్ట్ర నాయకులకు సూచించారు. తమిటీ విధివిధానాలపై ముందే ఒక అభిప్రాయానికి రావడం ఎవరికీ మంచిది కాదని ఆయన అన్నారు. మంగళవారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కాసేపు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కమిటీ విధివిధానాలు తమకు అనుకూలంగా లేకపోతే అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తామని తెలంగాణ శాసనసభ్యులు అనడాన్ని ప్రస్తావించగా విధివిధానాలు ఖరారు దశలో ఉన్నాయని, ఎవరూ దానిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దీనిపై అంత త్వరగా అభిప్రాయానికి రావడం మంచిది కాదని ఆయన అన్నారు.
పిసిసి సమన్వయ కమిటీ కూర్పుపై తెలంగాణ కాంగ్రెసు నేతల్లో వ్యక్తమవుతున్న అసంతృప్తిని ప్రస్తావించగా అది కేవలం తెలంగాణ కోసం వేసింది కాదని, మొత్తం ఆంధ్రప్రదేశ్ కు ఏర్పాటు చేశారని, పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయం కోసం ఆ కమిటీ పని చేస్తుందని ఆయన వివరించారు. కమిటీ కూర్పు కూడా తనకు సంబంధించిన వ్యవహారం కాదని, పార్టీ అధిష్టానం వేసిన కమిటీ అని, దానిపై తానేమీ మాట్లాడబోనని ఆయన అన్నారు. శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలు త్వరలోనే ఖరారవుతాయని ఆయన అన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి