హైదరాబాద్: శాసనసభ సక్రమంగా, సజావుగా సాగడానికి సహకరించాలని ముఖ్యమంత్రి కె. రోశయ్య కోరారు. రానున్న శాసనసభ బడ్జెట్ సమావేశాలపై అధికారులకు, మంత్రులకు ఆయన బుధవారం దిశానిర్దేశం చేశారు. శాసనసభలో ఎవరి బాధ్యతలను వారు సక్రమంగా నిర్వర్తించాలని ఆయన సూచించారు. ప్రతిపక్షాలను సమర్థంగా ఎదుర్కోవాలని ఆయన సూచించారు. జీరో అవర్ లో ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలను చులకనగా చూడవద్దని ఆయన అన్నారు. ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రతి అంశానికి తగిన సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయాలని ఆయన అన్నారు. ఇవి అత్యంత ప్రధానమైన శాసనసభా సమావేశాలని, అందువల్ల అందరూ బాధ్యతా యుతంగా ఉండాలని ఆయన అన్నారు.
దురదృష్టవశాత్తు అనుభవం గల వైయస్ రాజశేఖర రెడ్డి లేరని, అందువల్ల తాము అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. విమర్శలను సానుకూల దృక్పథంతో తీసుకోవాలని, తొందరపాటు సమాధానాలు కూడదని ఆయన అన్నారు. విద్యార్థులకు ఉపకార వేతనాలు అందడం లేదనే ఆరోపణలు వస్తున్నాయని, దాన్ని పరిశీలించాలని ఆయన అన్నారు. అధిక ధరలపై సమావేశంలో కీలక చర్చ జరిగే అవకాశం ఉందని, ఇందులో ప్రతిపక్షాల నుంచి వచ్చే విమర్శలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు. వైయస్ సభను సమర్థంగా నడిపించేవారని, ఇప్పుడు కూడా అదే విధంగా నడిపించేలా చూడాలని ఆయన అన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి