కెవిపికి మేం భయపడేది లేదు: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
State
oi-Pratapreddy
By Pratap
|
హైదరాబాద్: కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు, రాష్ట్ర భద్రతా సలహాదారు కెవిపి రామచందర్ రావుకు భయపడేది లేదని, తాము కెవిపి అవినీతిపై పోరాటం చేస్తామని తెలుగుదేశం నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. తమ పార్టీ నేత నారా చంద్రబాబు నాయుడికి కెవిపి రామచందర్ రావు రాసిన బహిరంగ లేఖపై ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా విరుచుకుపడ్డారు. కెవిపిపై తాము రాజకీయ పోరాటం చేస్తామని, తాము ఒక వ్యక్తి మీద పోరాటం చేయడం లేదని, దుష్టశక్తి మీద పోరాటం చేస్తున్నామని ఆయన అన్నారు. పైస్థాయిలో కెవిపి రామచందర్ రావు అవినీతికి పాల్పడ్డారని ఆయన విమర్శించారు. నీటిపారుదల శాఖ, రోడ్లు భవవనాల శాఖ టెండర్లు కెవిపి సూచనలు లేకుండా ముందుకు సాగవని ఆయన అన్నారు. కెవిపి అవినీతి చర్యలకు సహకరించకపోవడం వల్లనే నీటిపారుదల శాఖ నుంచి ఛటర్జీ అనే అధికారిని బదిలీ చేశారని ఆయన ఆరోపించారు.
దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డిని అడ్డం పెట్టుకుని కెవిపి రామచందర్ రావు అవినీతి కార్యక్రమాలకు పాల్పడి డబ్బులు లెక్కలేకుండా సంపాదించారని, ఇందులో అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. కెవిపి అక్రమాల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాళా తీసే పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీ అధిష్టానం ఇచ్చిన అలుసును ఆసరాగా చేసుకుని కెవిపి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. కెవిపి అవినీతి ఆరోపణలపై ముఖ్యమంత్రి కె. రోశయ్య ఎందుకు విచారణ జరిపించడం లేదని ఆయన అడిగారు. ఆంధ్ర శశికళ అని అన్నందుకు కెవిపి రామచందర్ రావు తమ నాయకుడు కోడెల శివప్రసాదరావుపై కోర్టుకు వెళ్లారని, తమపై ఎందుకు వెళ్లరని ఆయన అన్నారు. తమ పార్టీ నాయకులు ఇంకా కెవిపిపై కొత్త విషయాలు వెల్లడిస్తారని ఆయన అన్నారు. తాము చేసిన ఆరోపణలకు సమాధానం ఇవ్వకుండా కెవిపి తమ నేత చంద్రబాబుపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి