హైదరాబాద్: అక్రమాస్తులను కలిగి ఉన్న శాసనసభ ప్రత్యేక కార్యదర్శి కోలేటి గోపాలకృష్ణను అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు గురువారం అరెస్టు చేశారు. హైదరాబాదు, నెల్లూరు, తిరుపతిల్లోని ఆయన, ఆయన బంధువుల ఇళ్లపై దాడులు నిర్వహించిన అనంతరం అక్రమాస్తులు ఉన్నట్లు తేలడంతో గోపాలకృష్ణను ఎసిబి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గోపాలకృష్ణ దాదాపు 15 కోట్ల రూపాయల విలువ చేసే అక్రమాస్తులు కలిగి ఉన్నట్లు ఎసిబి అధికారి షికా గోయల్ చెప్పారు.
కాగా, తన ఎదుగుదలను చూసి సహించలేక సహోద్యోగులు తన ఇళ్లపై ఎసిబి అధికారులతో దాడులు చేయించారని గోపాలకృష్ణ ఆరోపిస్తున్నారు. తాను ఎటువంటి అవినీతికి కూడా పాల్పడలేదని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. కావాలనే తనను ఇరికించారని, ఆస్తులన్నీ తన కష్టార్జితమేనని, అక్రమాస్తులు కావని ఆయన అన్నారు. గోపాలకృష్ణ టైపిస్టుగా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. అంచెలంచెలుగా శాసనసభ ప్రత్యేక కార్యదర్శిగా ఎదిగారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి