హైదరాబాద్: తెలంగాణ విషయంలో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని బిజెపి రాష్ట్రాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ విమర్శించారు. ఆ రెండు పార్టీల డ్రామాల బండారం బయటపెడతామని ఆయన అన్నారు. తెలంగాణ జెఎసి కన్వీనర్ కోదండరామ్ తో భేటీ అనంతరం ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కచ్చితంగా కట్టుబడి ఉన్నామని, తెలంగాణ బిల్లును పార్లమెంటులో పెడితే బలపరచాలని తమ పార్టీ కచ్చితమైన నిర్ణయం తీసుకుందని ఆయన గుర్తు చేశారు.
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలంటే రాష్ట్రాన్ని రెండుగా విభజించాలని ఆయన అభిప్రాయపడ్డారు. శ్రీకృష్ణ కమిటీని వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టేలా ఒత్తిడి తేవాలని జెఎసి సమావేశంలో తమ వైఖరిని పెడతామని ఆయన చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలకు తమ పార్టీ ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆయన అన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి