న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ లోని తెలంగాణకు చెందిన వందలాది మంది న్యాయవాదులు సోమవారం పార్లమెంటు ముట్టడికి ప్రయత్నించారు. పార్లమెంటు భవనం వైపు న్యాయవాదులు పరుగులు తీశారు. పార్లమెంటు భవనానికి వంద మీటర్ల దూరంలో వారిని పోలీసులు అడ్డుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తక్షణమే పార్లమెంటులో బిల్లు ప్రతిపాదించాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగారు. దాదాపు రెండు వేల మంది న్యాయవాదులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఊహించని పరిణామంతో పోలీసులు అవాక్కయ్యారు. వారు తేరుకోవడానికి కొంత సమయం పట్టింది.
న్యాయవాదులను వాటర్ కానన్లతో పోలీసులు చెదరగొట్టారు. తొలి బారికేడ్ ను ఛేదించుకుని పార్లమెంటు ఐదో నెంబర్ గేటు వైపు లాయర్లు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ సంఘటనలో ఓ లాయర్ గుండెపోటుతో స్పృహ తప్పి పడిపోయాడు. అతన్ని ఆస్పత్రికి తరలించారు.ప్లకార్డులు ప్రదర్సిస్తూ తెలంగాణ అనుకూల నినాదాలు చేస్తూ న్యాయవాదులు జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశారు. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్లు ప్రతిపాదించాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. తెలంగాణలోని పది జిల్లాలకు చెందిన న్యాయవాదులు ఈ ధర్నాలో పాల్గొన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి