క్వారీ ప్రమాదంలో 20 మంది సజీవ సమాధి

సాయంత్రం 6.45 గంటలప్పుడు 200 అడుగుల లోతున క్వారీలో యంత్రాలతో కార్మికులు గెలాక్సీ గ్రానైట్‌ను వెలికితీస్తుండగా..ఒక్కసారిగా భారీ శబ్దంతో క్వారీ అంచులు కుప్పకూలాయి. విరిగిపడ్డ కొండ చరియల కింద కార్మికులతోపాటు 2 పొక్లెయిన్లు, మరికొన్ని యంత్రాలు చిక్కుకున్నాయి. సంఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. విరిగిన కొండచరియలు రెండు వేల టన్నులకుపైగా ఉండటంతో శకలాలు తొలగించడానికి రెండ్రోజులు పట్టొచ్చు. సంఘటనకు బాధ్యులుగా హంస గ్రానైట్ క్వారీ జనరల్ మేనేజర్ చంద్రారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి రోశయ్య చొరవతో కలెక్టర్, ఎస్పీలు వెలికితీత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ప్రకాశం జిల్లాలో సుమారు 43 క్వారీలు నడుస్తుండగా- చీమకుర్తి కేంద్రంగా క్వారీల్లో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు పనిచేస్తున్నారు. పదేళ్లలో 145 మంది కార్మికులు చనిపోయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. కొందరు క్వారీ యజమానులు ప్రమాదాలను నొక్కి పెడుతుండటంతో మరెన్నో మరణాలు వెలుగులోకి రావటం లేదు. ఈ ప్రమాదాలకు ప్రధానంగా భద్రతా లోపాలే కారణం. కార్మికులకు అవసరమైన హెల్మెట్లు, కళ్లద్దాలు, బూట్లు, ఇతర రక్షణ సౌకర్యాలేమీ కల్పించడం లేదు.