బీజేపీ ప్లాన్ కు చెక్ పెట్టేసిన విజయ్..! అంత పెద్ద ఆఫర్ కూ నో..!
తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ (vijay) నేతృత్వంలోని టీవీకే (TVK).. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 సీట్ల మెజార్టీని మాత్రం సాధించలేకపోయింది. దీంతో కాంగ్రెస్ (Congress) తో పాటు అన్నాడీఎంకే (AIADMK), ఇతర పార్టీల నుంచి వచ్చిన ఆఫర్లపై తేల్చుకోవాల్సిన పరిస్ధితి ఎదురైంది. దీన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు అన్నాడీఎంకే మిత్రపక్షం బీజేపీ రంగంలోకి దిగింది. అయితే వీరిద్దరికీ విజయ్ తాజాగా షాకిచ్చారు.
అన్నాడీఎంకేకు చెందిన 40 మందికి పైగా ఎమ్మెల్యేలు సీనియర్ నేత షణ్ముగం నివాసంలో సమావేశమై వేరు కుంపటి పెట్టుకోవాలని నిర్ణయించారు. వీరంతా అన్నాడీఎంకే నుంచి విడిపోయినట్లు నటించి విజయ్ పంచన చేరాలని భావించారు. తద్వారా విజయ్ ఏర్పాటు చేయబోయే ప్రభుత్వాన్ని తామే పరోక్షంగా నడపాలని బీజేపీ భావించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ చీలిక వర్గం విజయ్ కు మద్దతిస్తామని ఆఫర్ చేశారు. దీన్ని విజయ్ అంగీకరిస్తే ఇక కాంగ్రెస్, ఇతర చిన్న పార్టీల అవసరం ఉండదు. కానీ విజయ్ మాత్రం దీనికి నో చెప్పేశారు. కాంగ్రెస్ తో మాత్రమే కలిసి కూటమి ఏర్పాటు చేసి సంకీర్ణ ప్రభుత్వం నడిపేందుకు సిద్దమవుతున్నారు.

విజయ్ టీవీకే-కాంగ్రెస్ పొత్తు ఖరారు కావడంతో అన్నాడీఎంకేతో చర్చల్ని నిలిపేసినట్లు ఇరు పార్టీల వర్గాలు స్పష్టం చేశాయి. అన్నాడీఎంకే చీలిక వర్గాన్ని కలుపుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా కొత్త ప్రభుత్వంపై ఇతర పార్టీల్ని చీల్చారన్న అపనింద తప్పదు. అదే డీఎంకే కూటమిలోని చిన్న పార్టీల మద్దతు తీసుకుంటే కేవలం కూటమిలో చీలిక మాత్రమే కనిపిస్తుంది. దీంతో విజయ్ అన్నాడీఎంకేను కాదని కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అన్నాడీఎంకేతో పాటు దాని మిత్రపక్షం బీజేపీకీ నిరాశ తప్పలేదు.













Click it and Unblock the Notifications