హైదరాబాద్: రాష్ట్ర విభజన మంచిదేనని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన ప్రకటనను తెలంగాణ కాంగ్రెసు నాయకులు స్వాగతిస్తున్నారు. బొత్స సత్యనారాయణ ప్రకటనను స్వాగతిస్తున్నట్లు తెలంగాణకు చెందిన కాంగ్రెసు సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు అన్నారు. రాష్ట్ర విభజనకు అంగీకరించాలని, ఈ విషయాన్ని శ్రీకృష్ణ కమిటీకి చెప్పాలని తాను సీమాంధ్ర నేతలకు చేతులు జోడించి నమస్కరించి విన్నవిస్తున్నట్లు ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. శాసనసభ ఉప ఎన్నికల్లో పార్టీ చేస్తుందన్న పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ప్రకటనపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.
బొత్స సత్యనారాయణ ప్రకటనను మరో కాంగ్రెసు సీనియర్ నేత టి. జీవన్ రెడ్డి కూడా స్వాగతించారు. సీమాంధ్ర నాయకులు బొత్స సత్యనారాయణతో ఏకీభవించాలని ఆయన కోరారు. శాసనసభ ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పోటీ చేయడం సరి కాదని ఆయన విడిగా మీడియా ప్రతినిధులతో అన్నారు. హైదరాబాదుకు చెందిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దానం నాగేందర్ కూడా బొత్స సత్యనారాయణ ప్రకటనను స్వాగతించారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి