ఈ రాష్ట్రానికి ఏమైంది..? ఓవైపు హీట్ వేవ్.. మరోవైపు భారీ వర్షాలు..
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం వింత వాతావరణం నెలకొంది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకుపైగా చేరుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 301 మండలాల్లో హీట్ వేవ్ ముప్పు ఉన్నట్లు ప్రభుత్వం తాజా నివేదికలో వెల్లడించింది. ఇందులో 6 మండలాలు తీవ్ర ముప్పులో 106 మండలాలు అధిక స్థాయి అలాగే 189 మండలాలు మధ్యస్థ ముప్పు జాబితాలో ఉన్నట్లు పేర్కొంది. ముఖ్యంగా మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, సూర్యాపేట, కరీంనగర్, నల్గొండ జిల్లాల్లోని మండలాల్లో అధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.
ఇక మండే ఎండల కారణంగా చాలా మంది వృద్ధులు, బయట పనిచేసేవారు ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో మరణాలు అధికంగా సంభవిస్తున్నాయి. అటు వడగాలులు, ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. ఈ మేరకు వడదెబ్బ తగలకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచనలు చేస్తున్నారు.

మరోవైపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. గత కొద్దిరోజులుగా అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న ప్రజలకు ఇది మంచి ఉపశమనంగా భావించవచ్చు. మంచిర్యాల, మహబూబ్ నగర్, సిద్దిపేట జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడ్డాయి. ఇక ఇదే విషయంపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఇవాళ, రేపు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. అలాగే ఆయా జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications