హైదరాబాద్: అధికారుల పొరపాటు వల్ల శంకుస్థాపన విషయంలో తప్పిదం జరిగిందని, ఈ విషయంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సంబంధంలేదని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వివరణ ఇచ్చారు. అవుటర్ రింగ్‌రోడ్డు సెకండ్ ఫేజ్ నిర్మాణానికి ముఖ్యమంత్రి చేయనున్న శంకుస్థాపన కార్యక్రమం వివాదానికి దారితీసింది. మేడ్చర్ల ఎమ్మెల్యే కిచ్చన్నగారి లకారెడ్డి (కెఎల్‌ఆర్) రాజీనామా చేయడానికి కూడా సిద్ధపడ్డారు. ముఖ్యమంత్రి నచ్చజెప్పడంతో ఆయన వెనక్కు తగ్గారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. అవుటర్ రింగ్‌రోడ్డు సెకండ్ ఫేజ్ నిర్మాణానికి అప్పా వద్ద శంకుస్థాపనకు ఏర్పాట్లు చేశారు. మేడ్చల్ నుంచి ఘట్కేస్కర్ వరకు ఈ రోడ్డు నిర్మిస్తారు. తన నియోజకవర్గంలోని పనులకు పక్క నియోజకవర్గంలో శంకుస్థాపన చేయడంపట్ల కెఎల్‌ఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయమై కెఎల్‌ఆర్ ముఖ్యమంత్రిని కలసి హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. అప్పుడు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ముఖేష్‌గౌడ్, దానం నాగేందర్, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిలను ముఖ్యమంత్రి కె.రోశయ్య పిలిపించి ఈ విషయమై మాట్లాడారు. అధికారుల పొరపాటు వల్లే మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ముఖ్యమంత్రికి వివరణ ఇవ్వటంతో ఈ వివాదం ముగిసింది.