ప్రభుత్వ తప్పుడు ప్రచారానికి ఇదే రుజువు...కోదండరామ్
State
oi-Surya Prakash Josyula
By Srikanya
హైదరాబాద్: ఉస్మానియా క్యాంపస్‌లో తీవ్రవాదులు ఉన్నారంటూ ఆరోపించిన ప్రభుత్వం.. సుప్రీంకోర్టు ముందు సాక్ష్యాలు చూపించలేకపోయిందని, తద్వారా ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసినట్లు స్పష్టమైందని తెలంగాణ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ ఎం.కోదండరామ్ వ్యాఖ్యానించారు. క్యాంపస్‌లో పారా మిలటరీ బలగాలను మోహరించవద్దని, విద్యార్థులు శాంతియుతంగా నిర్వహించే కార్యక్రమాలకు అడ్డంకులు సృష్టించవద్దని తొలినుంచీ తాము చెబుతూనే వస్తున్నామని, అయినా ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని తాజాగా సుప్రీం కోర్టు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసిందని వివరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన తప్పులను గుర్తించి సవరించుకోవాలని కోరారు. అసలు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లకుండా ఉండి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ప్రజా సంఘాల నేతలు కె.గోవర్ధన్, సతీశ్ మాదిగ తదితరులతో కలిసి జేఏసీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విధంగా స్పందిచారు. రాష్టంలో ఓయూ తరహా ఘటనలు జరగడానికి కేవీపీ ఆధ్వర్యంలోని ప్రజా భద్రతా వ్యవహారాల కమిటీయే కారణం. అది రాజ్యాంగబద్ధమైన కమిటీ కాదు. దాని రద్దు కోసం న్యాయ పోరటం చేస్తాం అని కోదండరామ్ స్పష్టం చేశారు. అలాగే ప్రజా భద్రతా వ్యవహారాల కమిటీని తక్షణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో మార్చి తొమ్మిదో తేదీ నుంచి తెలంగాణ ఉద్యమ యాత్రను చేపట్టనున్నట్లు వెల్లడించారు.