హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పరిస్థితిపై అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం వేసిన శ్రీకృష్ణ కమిటీకి తమ పార్టీ నివేదిక సమర్పిస్తుందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చెప్పారు. తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ (జెఎసి) తరఫున ఎటువంటి నివేదిక కూడా ఇవ్వబోమని ఆయన చెప్పారు. పార్టీ పోలిట్ బ్యూరో సమావేశానంతరం ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం సమర్పించే లెక్కల వివరాలు తమకు ఇవ్వాలని కమిటీని కోరుతామని ఆయన చెప్పారు. కమిటీకి సమర్పించే నివేదికల రూపకల్పనకు 11 సబ్ కమిటీలను వేసినట్లు ఆయన చెప్పారు.
తెలంగాణ జెఎసి నిర్ణయం మేరకే తాము రాజీనామాలు చేశామని ఆయన చెప్పారు. శాసనసభ ఉప ఎన్నికల నోటిఫికేషన్ 14, 15 రోజుల్లో రావచ్చునని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో తమను ఏకగ్రీవంగా గెలిపించాలని ఏ పార్టీని కూడా అడగబోమని ఆయన చెప్పారు. పంచాయతీరాజ్ మంత్రి బొత్సను ప్రజల మనిషిగా ఆయన అభివర్ణించారు. బొత్స తన కన్నా గట్టిగా మాట్లాడారని ఆయన కొనియాడారు. సమైక్యాంధ్ర వల్ల సాధించేదేమిటన్న బొత్స ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేకపోయారని ఆయన అన్నారు.