హైదరాబాద్: తెలంగాణ న్యాయవాదులపై దాడి చేసింది తమ పార్టీ కార్యకర్తలు కారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ధరల పెరుగుదలపై నిరసన తెలుపుతుంటే మరో పార్టీ వారు వచ్చి అక్కడ నిరసన తెలపడం సరి కాదని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తాను విజ్ఞప్తి చేసినా వారు వినలేదని ఆయన చెప్పారు. పేదల సమస్యలపై పోరాటం చేస్తుంటే మరో పార్టీకి చెందినవారు వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేయడం సరి కాదని ఆయన అన్నారు.
తమ పార్టీ వైఖరి స్పష్టంగా ఉందని ఆయన అన్నారు. తమది నిలకడ, పద్ధతి గల పార్టీ అని ఆయన అన్నారు. ప్రజాభిప్రాయం మేరకే తాము వ్యవహరిస్తున్నామని ఆయన చెప్పారు. న్యాయవాదులకు తాను క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. న్యాయవాదులు ఏదో ఒక పార్టీకి చెందినవారని ఆయన అన్నారు. సమస్య ఉంటే వచ్చి వినతిపత్రం ఇవ్వాలే తప్ప అడ్డుకోవాలని చూడడం సరి కాదని ఆయన అన్నారు.