హైదరాబాద్: ధరల పెరుగుదలకు నిరసనగా తెలుగుదేశం, వామపక్షాలు శాసనసభ్యులు శనివారం ఉదయం వినూత్న నిరసన తెలిపారు. పెట్రో ధరల పెంపునకు నిరసనగా కారను తాడు కట్టి లాగారు. ఇందులో చంద్రబాబు కూడా పాలు పంచుకుని కారును లాగారు. హైదరాబాదులోని ట్యాంకుబండ్ పై మన్మోహన్ మంత్రాల కిరాణా దుకాణం పేరిట తెలుగుదేశం, వామపక్షాల శాసనసభ్యులు నిత్యావసర సరుకులను విక్రయించారు. ఆ తర్వాత తోపుడు బండ్లతో పాదయాత్రగా శాసనసభకు చేరుకున్నారు. ఇందులో చంద్రబాబు కూడా పాలు పంచుకున్నారు.
ధరల పెరుగుదలను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని చంద్రబాబు విమర్శించారు. సామాన్యుడి రక్తం పీలుస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. సామాన్యులు, పేదలు బతకడమే కష్టంగా ఉందని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. పైగా, రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ ద్వారా పేద నడ్డి విరిచే పనికి పూనుకుందని ఆయన విమర్సించారు. ధరల పెరుగుదలపై ఎంతగా మొత్తుకున్నా ప్రధాని మన్మోహన్ సింగ్ కు గానీ కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీకి గానీ పట్టడం లేదని ఆయన అన్నారు