హైదరాబాద్: తెలంగాణ న్యాయవాదులపై దాడి చేయించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ఆ పార్టీ తెలంగాణ నాయకులు వదిలేయాలని తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ (జెఎసి) కన్వీనర్ కోదండరామ్ డిమాండ్ చేశారు. తెలుగుదేశం తెలంగాణ నాయకులు ఎటు వైపు ఉంటారో తేల్చుకోవాలని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలంగాణ వైపు ఉంటారో, చంద్రబాబు వైపు ఉంటారో తేల్చుకోవాలని ఆయన సూచించారు.
పరిస్థితి ఇంత దాకా వచ్చిన తర్వాత కూడా తెలుగుదేశం తెలంగాణ నాయకులు తేల్చుకోకపోవడం అన్యాయమని ఆయన అన్నారు. తెలంగాణపై వైఖరి తెలపాలని అడిగిన న్యాయవాదులపై చంద్రబాబే దాడి చేయించారని ఆయన ఆరోపించారు. చిదంబరం ప్రకటన తర్వాత తొలిసారి తెలంగాణలో పర్యటిస్తున్న చంద్రబాబును వైఖరిని అడగడానికి, వైఖరి చెప్పాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా ఆందోళనకు దిగిన న్యాయవాదులపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేశారని ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఈ విధమైన దాడి అమానుషమని ఆయన అన్నారు.