విభజన జరిగితే తెలంగాణతో ఉంటాం: జెసి దివాకర్ రెడ్డి
State
oi-Pratapreddy
By Pratap
|
హైదరాబాద్: రాష్ట్ర విభజన అంటూ జరిగితే రాయలసీమను తెలంగాణతో కలపాలని అనంతపురం జిల్లాకు చెందిన కాంగ్రెసు శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి అన్నారు. శ్రీకృష్ణ కమిటీకి సమర్పించాల్సిన నివేదికపై చర్చించేందుకు బుధవారం సమావేశమైన రాయలసీమ కాంగ్రెసు శాసనసభ్యులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన జరిగితే తాము ఆంధ్రతో కలిస్తే రాయలసీమకు తెలంగాణ నుంచి చుక్క నీరు రాదని జెసి దివాకర్ రెడ్డి మీడియా ప్రతినిధులతో అన్నారు. రాయలసీమ, ఆంధ్ర కలిసి ఉంటే ఏ విధమైన ప్రయోజనం లేదని ఆయన అన్నారు. రాయలసీమకు ప్రత్యేకంగా వనరులంటూ ఏమీ లేవని ఆయన అన్నారు.
రాష్ట్ర విడిపోతే ఆంధ్రవారికి ఏ విధమైన నష్టం లేదని, నష్టమంతా రాయలసీమకేనని ఆయన అన్నారు. రాష్ట్రం విడిపోతే రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని మరో రాయలసీమ కాంగ్రెసు శాసనసభ్యుడు టిజి వెంకటేష్ అన్నారు. మహిళా బిల్లుపై తీసుకున్న మాదిరిగానే తమ పార్టీ కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణపై కూడా నిర్ణయం తీసుకోవచ్చునని ఆయన అన్నారు. తాము శ్రీకృష్ణ కమిటీకి సమైక్యనినాదాన్నే వినిపిస్తామని ఆయన చెప్పారు. కాంగ్రెసు ఎమ్మెల్సీ వైయస్ వివేకానంద రెడ్డి సమైక్యవాదం వినిపించారు.