ఆదరణకు తండ్రినే మర్చిపోతున్నా: జగన్

YS Jagan
ఏలూరు: మూడు రోజులుగా పశ్చిమగోదావరి జిల్లా ప్రజలు తనపట్ల చూపిస్తున్న ఆదరణ, ఆప్యాయత తన తండ్రిని కోల్పోయానన్న బాధను మరిపించేదిగా ఉందని, మీరందరూ ఉండగా నేనెందుకు బాధపడాలంటూ కడప కడప కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహనరెడ్డి అన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో జగన్ చేస్తున్న ఓదార్పు యాత్ర ఆదివారం నాటికి మూడో రోజుకు చేరింది. వాస్తవానికి మూడు రోజులపాటు జిల్లాలో ఈ యాత్ర నిర్వహించాలని తలపెట్టినప్పటికి బాధితులను ఓదార్చడంలో జాప్యం జరుగుతున్నందున ఈ యాత్రను సోమవారం నాటికి మరో రోజు పొడిగించారు. ఆదివారం ఆయన ప్రయాణించే మార్గంలో జనం నీరాజనాలు పలికారు. కూడళ్ళలో ఆయన ప్రసంగం వినేందుకు ఆసక్తి ప్రదర్శించారు. రెండు రోజులపాటు వరుసగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిన జగన్ మూడో రోజైన ఆదివారం మాత్రం వీటికి దూరంగా కేవలం వైయస్ తనయుడిగా తనను ఆశీర్వదించాల్సిందిగా మాత్రమే చెప్పుకుంటూ వెళ్ళారు. బాధితుల ఓదార్పు కోసం తాను వస్తే పశ్చిమ ప్రజలు చూపిస్తున్న ఆదరాభిమానాలతో తనను ఓదార్చడమే కాకుండా తండ్రి లేని లోటు మరిచిపోయేలా చేశారని, అందరి గుండెల్లో తన తండ్రే ఉన్నట్టుగా నిరూపించగలిగారని, ఇది రుణం తీర్చుకోలేనిదని జగన్ తన ప్రసంగాల్లో పదేపదే చెప్పారు.

మార్టేరు, పేకేరు, తణుకు, తాడేపల్లిగూడెం, అనంతపల్లి, యర్నగూడెం, దేవరపల్లి, కొవ్వూరు తదితర ప్రాంతాలన్నింటిలోను మార్గం వెంబడే జనం కిక్కిరిసి నిలబడ్డారు. తన యాత్రలో బాధితులను ఓదార్చేందుకే ఆదివారం ఎక్కువ సమయం కేటాయించిన జగన్ తన ప్రసంగ పాఠాన్ని మాత్రం కుదించారు. రెండురోజులపాటు రాజకీయ పరంగా చర్చ రేకెత్తించే విధంగా వ్యాఖ్యలు చేసిన ఆయన ఆదివారం మాత్రం దీనికి భిన్నంగా మూడు నుంచి ఐదు నిమిషాలలోపే అన్ని చోట్ల ప్రసంగించి వివాదాలకు తావులేకుండా జాగ్రత్త వహించారు. మూడు రోజులపాటు జిల్లాలో ఓదార్పు యాత్ర సాగిస్తున్న జగన్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్, ముఖ్యమంత్రి కె.రోశయ్యతోసహా స్థానిక నేతల పేర్లను కూడా ఎక్కడా ప్రస్తావించకుండా కేవలం తన తండ్రి చేసిన పనులను మాత్రమే ప్రస్తావించి సరిపెట్టారు. ప్రభుత్వ పథకాలు చేపట్టడంలో తన తండ్రి రాజశేఖరరెడ్డి నమ్మకంగా వ్యవహరించారంటూ పలుచోట్ల చెప్పారు. బాధిత కుటుంబాలను ఓదారుద్దామని జిల్లాకు వస్తే ఇక్కడి వారంతా తననే ఓదారుస్తున్నారని, దీనికి ఏమి రుణం ఇచ్చి తీర్చుకుంటానంటూ ప్రశ్నలు కురిపించారు. జగన్ వెంబడి మంత్రులు వసంతకుమార్, పితాని సత్యనారాయణతోపాటు స్థానిక ఎమ్మెల్యేలు నియోజకవర్గాల వారీగా ఓదార్పు యాత్రలో పాలుపంచుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+